ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దాని ఆధారంగా ఓపెన్ ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ.. ఆశ్చర్యపరిచే తన పనితనంతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోంది. అది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. యూజర్లు తమ అనుభవాలను కథలుకథలుగా పంచుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి తనకు డబ్బులు కావాలి అని అడగగా.. అతడు క్లెయిమ్ చేసుకోని 210 డాలర్లు (దాదాపు రూ.17,000) రికవరీ చేసిపెట్టింది. దీంతో షాక్ అవడం ఆ వ్యక్తి వంతైంది. తనకు జరిగిన ఘటనను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు అమెరికాకు చెందిన ఆ వ్యక్తి.
"నా పేరు జోషువా బ్రౌడర్. నేను కాలిఫోర్నియాలో ఉంటాను. నా పుట్టిన తేది 12/17/96. నాకు కొంత డబ్బులు కావాలి?" అని ఆ వ్యక్తి చాట్‌జీపీటీతో అడిగాడు. అనంతరం రంగంలోకి దిగిన చాట్‌జీపీటీ.. అతడి పేరు, వివరాలను నమోదు చేసి.. అతడు ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకోని ఆఫర్‌ను ఆన్లైన్లో వెతికిపెట్టింది. ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా చెప్పింది. బ్రౌడర్ కూడా చాట్‌జీపీటీ చెప్పింది ఫాలో అయ్యాడు. నిమిషం వ్యవధిలోనే కాలిఫోర్నియా ప్రభుత్వం నుంచి 210 డాలర్లు తన బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయని చెప్పుకొచ్చాడు. అయితే, చాట్‌బాట్‌కు క్యాప్చా రీడ్ చేయడంలో ఇబ్బంది తలెత్తిందని.. అది మినహాయిస్తే మిగతాదంతా.. అదే చేసిందని తెలిపాడు.
బ్రౌడర్ పోస్ట్ చేసిన ట్వీట్‌పై.. రకరకాలుగా స్పందించారు యూజర్లు. చాట్‌జీపీటీతో తమకు జరిగిన సంఘటనలు కూడా షేర్ చేసుకున్నారు. ఈ మేరకు ఓ నెటిజన్ స్పందింస్తూ.. "(బ్రౌడర్ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ) ఇది షేర్ చేసినందుకు ధన్యవాదాలు! నేను కూడా దాన్ని చెక్ చేశాను. ఏమీ ఆశించకుండా.. చెక్ చేసి చూశాను. నా పేరు మీద ఇప్పటివరకు క్లెయిమ్ చేయని 385 డాలర్లు ఉన్నాయి" అని తెలిపాడు. "మీరు ఇచ్చిన చిట్కాకు ధన్యవాదాలు. నా పేరు మీద ఇప్పటివరకు క్లెయిమ్ చేయని ఐదు ఆస్తులు ఉన్నాయి" అని మరో యూజర్ చెప్పుకొచ్చాడు. "ప్రతిరోజు ఏఐ.. దాని శక్తి సామర్థ్యాలతో నన్ను ఆశ్చర్యపరుస్తోంది" అని ఒకరు.. "వ్యక్తిగత సమాచారాన్ని ఏఐలో ఉంచడం బాధాకరం. మీలో కొందరు తెలివైన వ్యక్తులు కాదు'' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
అయితే, ఏఐ సాంకేతికత.. ఇలాంటి పనులతో ఓవైపు ఆశ్చర్యపరుస్తూనే.. మరోవైపు, భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏఐలో కనిపిస్తున్న పురోగతి.. దాదాపు 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచానా వేసింది. రానున్న రోజుల్లో ఈ కృత్రిమ మేధ దేనికి దారితీస్తుందో వేచి చూడాలి.