ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆ సంస్థకు సంబంధించిన రూ. 3,700 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల జప్తుపై ఆదాయపు శాఖ జారీ చేసిన ఆదేశాలను న్యాయస్థానం తాత్కాలికంగా పక్కన పెట్టింది. డిసెంబరు 16న వెలువరించిన తీర్పులో భాగంగా జస్టిస్ ఎస్ ఆర్ కృష్ణ కుమార్ మూడు షరతులు విధించారు. మొదట.. భారత్ వెలుపల ఉన్న సంస్థలకు ఏదైనా చెల్లింపులు చేయాలనుకుంటే షావోమీ తన ఫిక్స్డ్ డిపాజిట్ల ఖాతాల నుంచి రాయల్టీ రూపంలో కానీ మరేదైనా రూపంలో కానీ చెల్లింపులు చేయడానికి అర్హత కలిగి ఉండదు.
అయితే అటువంటి కంపెనీలకు చెల్లింపు చేయాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ల ఖాతాల నుంచి ఓవర్‌డ్రాఫ్ట్‌లు తీసుకుని చెల్లించే సౌకర్యం ఉంది. అలాగే 2019 నుంచి 2022 ఆర్థిక సంవత్సరాలకు షావోమీకి సంబంధించిన డ్రాఫ్ట్ అసెస్మెంట్ ప్రొసీడింగ్‌లను మార్చి 31, 2023లోపు పూర్తి చేయాలని ఆదాయపు పన్ను శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇది వరకే షావోమీకి భారత్‌లో గట్టి షాక్ తగిలింది. ఫెమా(విదేశీ మారక చట్టం) నిబంధనల ఉల్లంఘనల కింద షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ.5551.27కోట్ల డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఫెమా కంపీటెంట్ అథారిటీ ఇందుకు ఆమోదముద్ర వేసింది.