షాపింగ్ చేసిన తరువాత వ్యాపార సంస్థలు మీ మొబైల్ నంబర్‌ను అడుగుతున్నాయా? నంబర్ ఇస్తే గానీ బిల్ చేయమని చెబుతున్నాయా? ఆ తర్వాత స్పామ్ కాల్స్, అనవసర మెస్సేజ్‌లతో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారా? ఇకపై వాటి నుంచి మీకు విముక్తి కలిగినట్లే. వీటన్నింటికీ చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. బిల్ చెల్లించేటప్పుడు, ఇతర సమయాల్లో షాపుల్లో.. మొబైల్ నంబర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కస్టమర్లకు సేవలు అందించేందుకు.. వ్యక్తిగత వివరాల కోసం వారిపై ఎలాంటి ఒత్తిడి చేయవద్దని వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
"కస్టమర్ల మొబైల్ నంబర్లు ఇస్తే గానీ వినియోగదారులకు.. వ్యాపారస్తులు సేవలు అందించడం లేదు. ఇలాంటి ఫిర్యాదులు కస్టమర్ల నుంచి మాకు చాలానే అందాయి. విక్రయదారులకు.. కస్టమర్ల వ్యక్తిగత మొబైల్ నంబర్ ఇస్తే తప్ప వారు బిల్ ఇవ్వడం లేదు. ఈ పద్ధతి మంచిది కాదు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం.. కస్టమర్ల వివరాలను విక్రేతలకు చెప్పాల్సిన అవసరం లేదు." అని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు.
వీటివల్ల మొబైల్ నంబర్లు లీక్ అవుతాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. విక్రయదారులకు మొబైల్ నంబర్లు ఇచ్చిన తరువాత.. వారికి స్మామ్ కాల్స్, ఇతర అనవసర మెస్సేజ్‌లు వస్తున్నాయని.. వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన వివరించారు. దీంతో రిటైల్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ ఛాంబర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI)కి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు రోహిత్ కుమార్ వెల్లడించారు. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌లో బిల్ ఇచ్చేందుకు మొబైల్ నంబర్ అవసరం లేదని రోహిత్ కుమార్ మరోసారి సృష్టం చేశారు.
మెడికల్ షాపుల్లో ట్యాబ్లెట్ల కొనుగోళ్లపై కేంద్రం కొత్త విధానాలు..
మెడికల్ షాపుల్లో మొత్తం టాబ్లెట్ స్ట్రిప్‌ను కొనుగోలు చేయాలని కస్టమర్లపై ఒత్తిడి పెరుగుతున్న వేళ.. దీనిపై కూడా చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. టాబ్లెట్స్, క్యాప్సూల్స్ల మొత్తం స్ట్రిప్ కొనుగోలు చేయాలని ఔషధాల విక్రయదారులు.. కస్టమర్లపై ఒత్తిడి తెస్తున్నారనే ఫిర్యాదులు తమకు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వినియోగదారుల రక్షణ కోసం.. అందుకు పరిష్కారం దిశగా ఫార్మా ఇండస్ట్రీతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రం తెలిపింది.
కస్టమర్లపై ఒత్తిడి చేసి మొత్తం స్ట్రిప్‌ను కొనిపించేలా చేయడం మెడికల్ వేస్టేజ్‌కు దారితీస్తుందని.. దీంతో పాటు వినియోగదారులపై అనవసర ఆర్థిక భారం పడుతుందని కేంద్రం వివరించింది. దీనిపై ఫార్మా, వైద్య పరికరాల పరిశ్రమకు చెందిన వివిధ సీనియర్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపిన కేంద్రం.. ఔషధాల ప్యాకింగ్‌కు కొత్త టెక్నాలజీని తీసుకువచ్చే విధంగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.
స్ట్రిప్‌ను కత్తిరించేందుకు పెర్ఫరేషన్ టెక్నాలజీని అవలంభించాలని పరిశ్రమలకు కేంద్రం సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రతి స్ట్రిప్‌పై తయారీ, గడువు తేదీని ముద్రించాలని, క్యూఆర్ కోడ్‌ను కూడా ఉపయోగించాలని కేంద్ర సిఫార్సు చేసినట్లు వర్గాలు తెలిపాయి. కాాగా కస్టమర్లు స్ట్రిప్ మొత్తాన్ని కొనుగోలు చేయకపోతే.. వాటిని అమ్మేందుకు విక్రయదారులు నిరాకరిస్తున్నారన్న ఫిర్యాదులు తమకు అందినట్లు కేంద్రం తెలిపింది. దీనిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.