Elon Musk twitter: విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమం 'ట్విట్టర్'ను కొనుగోలు చేశారు. తాజాగా 44 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన ఆయన.. రెండు వారాల క్రితమే ఈ సంస్థలో 9.2% వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం సంస్థ మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకున్నారు.
కొనుగోలు ఒప్పందం గురించి మస్క్‌తో ట్విటర్ బోర్డు కొన్నాళ్లుగా విస్తృత చర్చలు జరుపుతోంది. ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 46.5 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమని మస్క్ గతవారం ప్రకటించారు. వాక్ స్వాతంత్య్రానికి మరింత అనువైన వేదికగా దాన్ని తీర్చిదిద్దుతానని ఉద్ఘాటించారు. కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో ట్విటర్ షేరు సోమవారం 3 శాతం పెరిగింది. ట్విటర్ కొనుగోలు నిధులను బ్యాంకుల ద్వారా మస్క్ సమకూర్చుకున్నట్లు 'ద వాల్ స్ట్రీట్ జర్నల్' పేర్కొంది.
మళ్లీ ట్విట్టర్‌లో చేరను..
ఎలాన్ మస్క్ చేతిలోకి వెళ్లిన ట్విట్టర్‌లో.. తన ఖాతాను పునరుద్ధరించినప్పటికీ.. మళ్లీ అందులో చేరాలన్న ఉద్దేశ్యం లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాది మెుదట్లో తాను ప్రారంభించిన 'ట్రూత్ సోషల్' సామాజిక మాధ్యమంపై ఎక్కువగా దృష్టిసారిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఎలాన్ మస్క్ మంచివాడని.. ట్విట్టర్‌ను మెరుగుపరుస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. గతేడాది అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్విట్టర్ సహా ప్రముఖ సామాజిక మాధ్యమాలు ట్రంప్ ఖాతాలపై నిషేధం విధించాయి. ఆ సమయంలో ట్విట్టర్‌లో ట్రంప్‌కు తర్వాత 8.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. ఆ తర్వాత 'ట్రూత్ సోషల్' అనే ఓ సొంత సామాజిక మాధ్యమాన్ని ట్రంప్ ప్రారంభించారు.
ఇదీ చదవండి: LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ తేదీ ఖరారు.. ఎప్పుడంటే?