Crypto Currency In India: క్రిప్టోకరెన్సీ నియంత్రణపై భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. క్రిప్టోపై నిర్ణయాలకు తొందరపడరాదని అభిప్రాయపడ్డారు. వినూత్నత, బ్లాక్‌చైన్‌లో వస్తున్న డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీల పురోగతిని ప్రోత్సాహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. క్రిప్టోకు సంబంధించి ఎవ్వరినీ నొప్పించే యోచన లేదని, ప్రతి దేశానికి సొంత నియంత్రణ అవసరమని అన్నారు.
అయితే క్రిప్టోకరెన్సీల వల్ల మనీలాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు అందే ప్రమాదం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు. భారత్‌కు మాత్రమే ఇవి సమస్య కాదని, అంతర్జాతీయ వేదికలపై పలు దేశాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని గుర్తుచేశారు. ఆర్‌బీఐ నియంత్రణలో భారత్ సొంత డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇదీ చదవండి: 'అప్పటికల్లా దేశీయ చిప్‌ల తయారీయే మా లక్ష్యం'