దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకులకు లోనవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కరోనా కేసుల్లో పెరుగుదల మదుపరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాక్సిన్లపై పెరుగుతోన్న అంచనాలు ఒకింత ఊరట కలిగించవచ్చు అంటున్నారు. వీటితో పాటు అమెరికా వ్యాక్సిన్ల పురోగతి సహా అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లకు కీలకం కానున్నాయి.
"ఈ వారం మార్కెట్లు ఒడుదొడుకులకు గురవుతాయి. కేసుల పెరుగుదలపై ఒకింత ఆందోళన, వ్యాక్సిన్ల పురోగతిపై ఆనందం మధ్య సూచీలు ఊగిసలాడే అవకాశం ఉంది. అమెరికా ప్రకటనలను మదుపరులు నిశితంగా పరిశీలిస్తారు."
- సిద్ధార్థ కేమ్కా, మోతిలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్‌లో రీసెర్చ్ రిటైల్ హెడ్
భారత కంపెనీల త్రైమాసిక ఫలితాలు, వ్యాక్సిన్‌పై కీలక ప్రకటనలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
కిందటి వారాంతంలో విదేశీ వ్యవస్థాగత పెట్టుబడిదారులు మార్కెట్లో కీలకంగా వ్యవహరించారు. 3,860 కోట్ల విలువగల షేర్లను కొనుగోలు చేశారు. అంతర్జాతీయ సానుకూలతలతోనే గత వారం మార్కెట్లు నడిచాయి. ఈ వారం కూడా వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన ఏమైనా వస్తే ఎఫ్ఐఐలు కీలకం కానున్నారని నిపుణులు అంటున్నారు.
వ్యాక్సిన్ పంపిణీ సమర్థత, ఆర్థిక పునరుత్తేజం వంటివి అంతర్జాతీయ మార్కెట్‌పై ఎక్కువ ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: మూడోరోజూ పెరిగిన పెట్రో ధరలు