కేంద్ర ప్రభుత్వం రూ. 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి (40 బేసిస్ పాయింట్లు) తగ్గించినట్లు చెప్పారు. టర్మ్‌లోన్లపై మారటోరియం మరో 90 రోజులు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్, ఉక్కు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు.
సిమెంట్ ఉత్పత్తిలో 25 శాతం తగ్గిందని తెలిపారు. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం మేర పడిపోయింది..ఏప్రిల్‌లో తయారీ రంగం ఎన్నడూలేనంత క్షీణత నమోదు చేసిందని శక్తికాంతదాస్ వివరించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడం వల్ల ఆహార భద్రతకు భరోసా ఏర్పడిందన్నారు.
"వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగడం వల్ల వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహకం ఉంటుంది. కూరగాయలు, నూనె గింజల ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో డిమాండ్ ఆధారంగా ద్రవ్యోల్బణం భవిష్యత్తు ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు పొంచి ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గింది"
- శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్