లాక్డౌన్ కారణంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది తయారీ రంగం. ఏప్రిల్ నెలలో వృద్ధి.. ఎన్నడూ లేనంతగా క్షీణించినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ సంక్షోభంతో కుదేలైన సంస్థలు.. ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయని పేర్కొంది.
ఐహెచ్ఎస్ మార్కిట్ విడుదల చేసిన ఈ నివేదికలో.. ఏప్రిల్లో తయారీ రంగం- పీఎంఐ(పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 27.4కు పడిపోయినట్లు తెలిసింది. మార్చిలో అది 51.8గా ఉండటం విశేషం. గత 15 సంవత్సరాల నుంచి పీఎంఐ డేటా సేకరణ జరుగుతుండగా.. ఈ స్థాయిలో పతనం నమోదు కావడం ఇదే తొలిసారి అని సర్వే పేర్కొంది.
దాదాపు 32 నెలల వృద్ధి తర్వాత పీఎంఐ సూచీ దిగువకు పడిపోయినట్లు సర్వే వెల్లడించింది.
కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. వ్యాపార కార్యకలాపాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ కారణంగానే ఏప్రిల్లో డిమాండ్ భారీగా తగ్గిపోయింది. గడిచిన రెండున్నరేళ్లలో ఎప్పుడూ లేనంతగా కొత్త ఆర్డర్లు తగ్గిపోయాయని సర్వే తెలిపింది. తన చరిత్రలోనే ఇది ఎన్నడూ చూడనంత తక్కువ అని ఐహెచ్ఎస్ పేర్కొనడం గమనార్హం.
ఇదీ చూడండి:కరోనా వేళ దేశీయ ఫార్మాకు సువర్ణావకాశం