రబీ పంటల కోత, హిందువుల నూతన సంవత్సరం కారణంగా దేశంలో మార్చి, ఏప్రిల్ మధ్య కరెన్సీ చలామణి (సీఐసీ) భారీగా పెరిగింది. వర్షాకాలం ఆరంభంతో మే నుంచి జూన్ మధ్య మళ్లీ కరెన్సీ చలామణి తగ్గుతున్నట్లు రిజర్వు బ్యాంక్ నివేదిక ఒకటి తెలిపింది.
'మోడలింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ కరెన్సీ డిమాండ్ ఇన్ ఇండియా:ఏ హెట్రోడాక్స్ అప్రోచ్' పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది ఆర్బీఐ. కేంద్రీయ బ్యాంక్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జానకీ రాజ్, ఇంద్రనీల్ భట్టా చార్య, సమీర్ రాజన్ బెహరా, జాయిస్ జాన్, భీమప్ప అర్జునన్ తల్వార్ దీనిని రూపొందించారు.
మే నుంచి జులై మధ్య సీఐసీ తగ్గినా.. పండుగ సీజన్ వల్ల అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య భారీగా పెరుగుతుందని అంచనా వేసింది ఆర్బీఐ నివేదిక.
దీపావళి పండుగ సమయంలో అత్యధికంగా 2.2 శాతం పెరగొచ్చని అంచనా. ఆ తర్వాతి స్థానాల్లో దసరా (1.1 శాతం), బక్రీద్ (0.2 శాతం) ఉండొచ్చని తెలుస్తోంది.
వడ్డీ రేట్లకు విలోనమానుపాతంలో కరెన్సీ డిమాండ్ ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే కరెన్సీ డిమాండ్ తక్కువగా.. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని ఆర్బీఐ నివేదిక గుర్తు చేసింది.
ఇదీ చూడండి:ఇండిగో ప్రయాణికులకు ఒక్కరికే రెండు సీట్లు!