పోటీ చట్టాల ఉల్లంఘన ఆరోపణలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌పై.. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ విచారణను అడ్డుకోవాలంటూ ఆయా సంస్థలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే విచారణలో పాల్గొనేందుకు ఆయా సంస్థలకు నాలుగు వారాలు గడువు పెంచింది అత్యున్నత న్యాయస్థానం.
విచారణ ఎందుకు?
ఆఫర్లు, విక్రయాల విషయంలో ఈ-కామర్స్ సంస్థలు ఎంపిక చేసిన వ్యాపారులకు మాత్రమే ప్రాధ్యాన్యమిస్తున్నాయని.. దీని ద్వారా పరోక్షంగా నియంత్రణకు పాల్పడుతున్నాయని.. దిల్లీ వ్యాపార్ మహాసంఘ్ సీసీఐకి గత ఏడాది ఫిర్యాదు చేసింది. దీనితో 2020 జనవరిలో సెక్షన్ 26(1) కింద ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించింది సీసీఐ. ఈ విచారణను అడ్డుకోవాలని ఈ-కామర్స్ సంస్థలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. అయితే సీసీఐ దర్యాప్తును అడ్డుకోవాలన్న వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తాజాగా అక్కడ కూడా ఆయా సంస్థలకు ప్రతికూలంగా నిర్ణయం వెలువడింది.
ఇదీ చదవండి: వొడాఫోన్ ఐడియాను నిలబెట్టేందుకు కేంద్రం కసరత్తు