సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఫేస్బుక్, ట్విట్టర్ షేర్లు అమెరికా మార్కెట్లలో శుక్రవారం భారీగా కుదేలయ్యాయి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ ఏడాది చివరి నుంచి ప్రకటనలు నిలిపివేయనున్నట్లు బెన్&జెర్రీ ఐస్‌క్రీమ్, డౌవ్సోప్ల మాతృసంస్థ యునిలీవర్ తెలపడం ఇందుకు కారణమైంది. విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా తమ నిరసన తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యునిలివర్ వెల్లడించింది.
యునిలీవర్ ప్రకటన తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్ షేర్లు 7 శాతానికిపైగా నష్టపోయాయి.
తాజా నిర్ణయంతో.. ఇప్పటికే ప్రకటనలు నిలిపేసి బాయ్‌కాట్ ఫేస్బుక్ ఉద్యమం చేస్తున్న సంస్థల జాబితాలో యునిలీవర్ చేరింది. హింసాత్మక, జాత్యహంకార కంటెంట్‌ను నిరోధించేందుకు.. ఫేస్‌బుక్‌పై ఒత్తిడి తేవడం ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం.
ఈ విషయంపై స్పందించేందుకు ఫేస్బుక్ నిరాకరించింది. ట్విట్టర్ మాత్రం తమ భాగస్వామ్యుల నిర్ణయాలను గౌరవిస్తూ.. వారితో కలిసి పని చేస్తామని వెల్లడించింది.
ఇదీ చూడండి:ఆగని పెట్రో వాత.. 21వ రోజూ ధరలు పైపైకి