అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో.. దేశీయంగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది కేంద్రం. పెట్రోల్ రూ.10, డీజిల్‌పై 13 రూపాయల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.
కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు ప్రకారం.. లీటర్ పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని రూ.2, డీజిల్‌పై రూ.5 పెంచారు. రోడ్డు సెస్‌ను పెట్రోల్, డీజిల్‌పై రూ.8 చొప్పున పెంచారు. తాజా పెంపుతో మొత్తం ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్‌పై రూ.32.98కు, డీజిల్‌పై రూ.31.83కు ఎగబాకింది.
ఆర్థిక వ్యవస్థకు మేలే!
ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గుతున్నప్పటికీ దేశీయంగా కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేలు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సుంకం పెంపుతో దాదాపు రూ.1.6 లక్షల కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు చేరనుందని అంచనా వేస్తున్నారు.
''భారత ప్రభుత్వం... పెట్రోల్, డీజిల్‌పై వరుసగా బ్యారెల్‌కు 21, 27 డాలర్లు చొప్పున పెంచింది. ఈ పెంపు ఆర్థిక సంవత్సరం మొత్తం కొనసాగిస్తే.. ప్రభుత్వ పన్ను వసూళ్లు 21 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయి.''
-వికాస్ హలన్, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్
2 నెలల్లో రెండోసారి...
రెండు నెలల వ్యవధిలో ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. చివరగా మార్చి 14న పెట్రోల్, డీజిల్‌పై చెరో రూ. 3 చొప్పున పన్ను వడ్డించారు. అలా దాదాపు రూ.39 వేల కోట్ల వార్షికాదాయం సమకూరుతుందని అంచనా.
మొత్తంగా ఎక్సైజ్ సుంకం ద్వారా దాదాపు రూ.2 లక్షల కోట్లపైనే ప్రభుత్వ ఖజానాకు చేరనుంది.
9 సార్లు...
అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోయినకారణంగా.. 2014 నవంబర్- 2016 జనవరి మధ్య నరేంద్ర మోదీ ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 9 సార్లు పెంచింది. మోదీ సర్కార్.. తొలిసారి అధికారంలోకి వచ్చే 2014 నాటికి ఈ రెండింటిపై ఎక్సైజ్ సుంకం వరుసగా 9.48, 3.56 గా ఉంది.