బంగారం ధర బుధవారం కూడా భారీగా రూ.1,228 తగ్గింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,946 వద్దకు చేరింది.
పసిడి ధరల తగ్గుదలకు కారణాలు..
డాలర్ బలపడటం, పసిడి మదుపరులు లాభాల స్వీకరణకు దిగటం వంటి కారణాలతో బంగారం ధరలు దిగివస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఒరవడి తాత్కాలికమే అని.. పరిస్థితులు దేశీయంగా, అంతర్జాతీయంగా పూర్తిస్థాయిలో సానుకూలంగా మారే వరకు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతాయని నిపుణులు అంటున్నారు.
ఆర్థిక వ్యవస్థలు కోలుకోవటం, బులియన్ మార్కెట్ పరిస్థితులకు లోబడి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా సానుకూల పవనాలతో.. పసిడి ధరలు మరో పది నుంచి పదిహేను శాతం దిగివచ్చే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
వెండి ధర కిలోకు బుధవారం ఏకంగా రూ.5,172 తగ్గి.. కిలో ధర ప్రస్తుతం వద్ద రూ.67,584 గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,930 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 27.70 డాలర్ల వద్ద ఉంది.
పసిడి రికార్డులు ఇలా..
అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా బంగారం ధరలు పెరుగుతుంటాయి. అలానే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరగటం, ఆర్థిక వ్యవస్థలు బలహీనపడటం, యూఎస్-చైనా ట్రేడ్ వార్, డాలర్-రూపాయ మారకం బలహీనపడటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనితో మదుపరులు పసిడిని సురక్షితంగా భావించి.. భారీగా పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా.. బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. ఒకానొక దశలో 10 గ్రాముల బంగారం ధర రూ.58 వేల మార్క్‌ను కూడా దాటింది.
ఇదీ చూడండి:ఆ కారుకు 'కీ'గా చిన్నారుల స్మార్ట్‌వాచ్