ఆధార్ వివరాల ఆధారంగా ఆన్లైన్లో తక్షణమే 'ఈ-పాన్'ను కేటాయించే విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ సేవ పూర్తిగా ఉచితమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.
2020-21 బడ్జెట్లో... పాన్ కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓ ప్రతిపాదన చేశారు. అందులో భాగంగా ప్రతిసారీ అన్ని వివరాలతో దరఖాస్తు ఫారం నింపాల్సిన అవసరం లేకుండా.. ఆధార్ వివరాల ఆధారంగా ఆన్లైన్లో అప్పటికప్పుడు పాన్ సంఖ్యను కేటాయించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
"చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్, ఆధార్‌తో అనుసంధానం చేసిన ఫోన్ నెంబర్ ఉన్న పాన్ దరఖాస్తుదారులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రానిక్ పాన్ (ఈ-పాన్) పూర్తి ఉచితంగా లభిస్తుంది."
- కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)
డిజిటల్ ఇండియా
డిజిటల్ ఇండియాలో భాగంగా ఆదాయపు పన్ను శాఖను డిజిటలైజ్ చేసేందుకు; పన్ను చెల్లింపుదారులకు అనువుగా టాక్స్ పేయింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు... ఈ-పాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సీబీడీటీ తెలిపింది.
2020 మే 25 నాటికి 50.52 కోట్ల పాన్ కార్డులను పన్ను చెల్లింపుదారులకు కేటాయించారు. వీటిలో సుమారు 49.39 కోట్ల పాన్లు వ్యక్తులకు కేటాయించినవి. ఇప్పటి వరకు ఆధార్‌తో అనుసంధానం అయిన పాన్ల సంఖ్య 32.17 కోట్లు.
ఇదీ చూడండి: జెన్ జెడ్ స్పెషల్ శాంసంగ్ 'గెలాక్సీ ఏ51' విడుదల