Gold Loan: పిల్లల చదువు నుంచి పెద్దల అనారోగ్యం వరకు ఇలా.. ఏదైనా అత్యవసరం కోసం స్వల్పకాలానికి రుణం కావాలంటే సులభంగా అందేది, నమ్మదగినది బంగారం తనఖా రుణమే. ఇంట్లో ఉన్న ఆభరణాన్ని తీసుకెళ్లి, నగదు తెచ్చుకుని, మళ్లీ ఏదైనా మొత్తం చేతికి రాగానే ఆభరణాలు విడిపించుకుంటారు. కొన్నేళ్లుగా బంగారం తనఖా రుణాల వ్యాపారంలో ఎన్‌బీఎఫ్‌సీలదే అధిక వాటా. తక్కువ వడ్డీ వసూలు చేస్తున్నా.. బ్యాంకులు మాత్రం ఈ విషయంలో వెనకబడే ఉన్నాయి. బ్యాంకుల్లో కావాల్సినంత రుణం ఇవ్వరని, రెండుమూడు సార్లు తిప్పుకుంటారనే ఆరోపణలు వచ్చేవి. అయితే ఇప్పుడు బ్యాంకులూ తీరు మార్చుకున్నాయి. గతేడాది కరోనా లాక్‌డౌన్‌లు తొలగించాక పసిడి ధరలు పెరిగాయి. అపుడు తనఖా రుణ వ్యాపారమూ పుంజుకుంది. కరోనా రెండో దశ మొదలయ్యాక, ఎగవేతలను తగ్గించుకునేందుకు ఎన్‌బీఎఫ్‌సీలు వడ్డీ రేట్లలో కోత వేశాయి. కొన్ని సంస్థలు రుణాలను పునరుద్ధరించడానికి సిద్ధపడగా.. మరికొన్ని దీపావళి సీజనులో ప్రత్యేక రుణ రేట్లతో ఆకర్షించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) పరపతి విధాన సమీక్ష నిర్ణయాల కారణంగా వడ్డీ రేట్లు తగ్గాయి. స్వల్పకాలానికే కావడంతో పాటు చిన్న మొత్తాలు, తక్కువ రుణ రేట్ల కారణంగా బ్యాంకులు పసిడి తనఖా రుణాలను పెద్దగా పరిశీలించవు. బంగారం నాణ్యత తనిఖీలో పొరపాట్లు జరిగితే, తమకు చుట్టుకుంటుందనే భయం బ్యాంకు అధికారులకు ఉంటుందని ఎన్‌బీఎఫ్‌సీ ప్రతినిధులు చెబుతుంటారు.
గ్రామాలు 'పసిడి'కొమ్మలు
ఇటీవలి కాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రాణించింది. కరోనా రెండో దశ అవాంతరాల నుంచి అసంఘటిత రంగం కూడా పుంజుకుంది. దీంతో మళ్లీ పసిడి రుణాలకు ఆసక్తి పెరిగిందని విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు సగటున 18 శాతంగా ఉన్న వడ్డీ రేటును ఎన్‌బీఎఫ్‌సీలు ఇపుడు 14-15 శాతంగానే వసూలు చేస్తున్నాయి. బ్యాంకులు మాత్రం 6.5-13 శాతం రుణరేటుతో ఖాతాదార్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నాయి.
ఎన్‌బీఎఫ్‌సీలకు ఎవరు? బ్యాంకులకెవరు?
సాధారణంగా రూ.75,000 వరకు రుణాలు కావాల్సిన వారు ఎన్‌బీఎఫ్‌సీలకు వెళుతుంటారని.. అదే రూ.లక్షకు మించి రుణాలు ఆశించే వినియోగదార్లు బ్యాంకులను ఎంచుకుంటారని ఒక ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ మార్కెటింగ్ అధిపతి చెబుతున్నారు. సాధారణంగా పసిడి రుణాల సగటు గడువు నాలుగు నెలలు ఉంటుంది. ఇందువల్ల అధిక కార్యకలాపాల వ్యయాలవుతాయి. ఎందుకంటే పసిడి నిల్వ, బీమా వ్యయాలకు తోడు లోహం నాణ్యతను ధ్రువీకరించే అప్రైజర్ ఖర్చులు కూడా కలిసి ఉంటాయి. అదే గృహ రుణాల గడువు 15- 25 ఏళ్లుగా ఉంటుంది. ఒకసారి రుణం ఇస్తే, తరవాత వసూలు చేసుకోవడమే. సాధారణంగా అధిక విలువ రుణాలు ఇచ్చి కార్యకలాపాల వ్యయాలను తగ్గించుకోవాలని బ్యాంకులు భావిస్తున్నాయి. కరోనా అనంతరం మధ్యతరగతి వ్యక్తులు కూడా పసిడి రుణాలకు వస్తున్నారు. వీరంతా అధిక విలువ రుణాలనే కోరుతుంటారు. ప్రస్తుత ధోరణి కొనసాగితే పసిడి తనఖా రుణాలు 3-4 రెట్ల మేర పెరుగుతాయని ఒక బ్యాంకరు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: Debt of india: దేశం అప్పు రూ.135 లక్షల కోట్లు