ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణ మహోత్సవం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం నుంచి రాత్రి స్వామివారి కల్యాణం ముగిసే వరకు ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో ఈ ఆంక్షలు ఉంటాయని కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు.
కడప శివారులోని డీటీసీ వద్దనున్న రిమ్స్ బైపాస్ మీదుగా భారీ వాహనాలు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి కడపకు వచ్చే వాహనాలను సాలాబాద్ క్రాస్ నుంచి మలకాటిపల్లి, రాచపల్లి, సీతానగరం, రాచగుడిపల్లి, ఇబ్రహీంపేట, గంగపేరూరు, బ్రాహ్మణపల్లి, మొహిద్దీన్ సాబ్ పల్లి, ముమ్ముడిగుండుపల్లి, మాధవరం ఉప్పరపల్లి వద్ద హైవేలో చేరుకోవాలని ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు. కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు మాధవరం, ఉప్పరపల్లి, సాయిబాబా గుడి వైపు నుంచి ముమ్మడిగుండుపల్లి, బ్రాహ్మణపల్లి, పేరూరుగంగ, మలకాటిపల్లి మీదుగా సాలాబాద్ క్రాస్ నుంచి వాహనాలు వెళ్లాలని ఎస్పీ సూచించారు.
కడప నుంచి ఒంటిమిట్టకు వెళ్లే భక్తుల వాహనాలు...కల్యాణ వేదిక పడమర వైపున ఓబుల్ రెడ్డి వాటర్ ప్లాంట్, సాయి కాళేశ్వర్ డిగ్రీ కళాశాల, ఉప్పరపల్లి వద్దనున్న సాయిబాబా గుడి వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజంపేట వైపు నుంచి ఒంటిమిట్టకు వచ్చే వాహనాలను ఆలయం ఎదురుగా ఉన్న దుర్గమ్మగుడి వద్ద, సాలాబాద్ క్రాస్ వద్ద, మలకాటిపల్లెలో పార్కింగ్ స్థలాలు కేటాయించామన్నారు. కల్యాణం సందర్భంగా భక్తులంతా ట్రాఫిక్ ఆంక్షలు పాటించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని అభిషేక్ మహంతి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి : బైక్ నుంచి 3 లక్షలు చోరీ... సీసీ కెమెరాలో దృశ్యాలు