హిందు మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతాల్లో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ ఉదయం వాయుగుండంగా మారి..అదే ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఈ అల్పపీడనం శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు- ఆగ్నేయ దిశగా 1,140 కిలోమీటర్ల దూరంలో తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తర్వాతి 12 గంటల్లో తుపానుగా మారొచ్చని వెల్లడించింది. మంగళవారం సాయంత్రానికి దక్షిణ- కోస్తాంధ్రా,ఉత్తర తమిళనాడు తీరాలను తాకొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ అల్పపీడనం మచిలీపట్నానికి దక్షిణాగ్నేయ దిశగా 1,760 కి.మీ, చెన్నైకు ఆగ్నేయ దిశగా 1,490 కి.మీల దూరంలో విస్తరిస్తోంది. మరో 5 రోజుల్లో శ్రీలంక తీరప్రాంతం వెంబడి వాయువ్య దిశగా తుపాను వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
పక్కరాష్ట్రాలూ..అప్రమత్తం...
ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. పుదుచ్చేరిలో సెలవుపై వెళ్లిన అధికారులను అత్యవసరంగా సెలవులను రద్దు చేసుకుని విధులలో చేరవలసిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తమిళనాడులో తుపాను సహాయక కార్యక్రమాలకై సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు ఎటువంటి నిబంధనలు వర్తించబోవని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యబ్రత సాహు తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర విపత్తు బలగాలు సిద్ధంగా ఉండాల్సిందిగా తమిళనాడు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చదవండి.. ప్రతికూల వాతావరణం... పలు విమానాలు రద్దు