రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 25 తేదీ నుంచి 29 తేదీ మధ్య ఉష్ణోగ్రతల తీవ్రత 48 డిగ్రీలకు మించిపోనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం వాయువ్య భారత్లోని రాజస్థాన్, గుజరాత్ల మీదుగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర జిల్లాల వరకూ ఉష్ణగాలులు వీస్తున్నాయి. దీంతో మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా నమోదు అవుతోందనీ.. ఈ ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా ఉందనీ.. రాగల నాలుగైదు రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత 48 డిగ్రీలకు మించి నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయనీ ఆర్టీజీఎస్ తెలియజేసింది. ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రంలో వడగాల్పుల ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందని తెలిపింది. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వడగాల్పుల తీవ్రత అత్యంత ఎక్కువ స్థాయిలో ఉంటుందనీ.. కృష్ణా, నెల్లూరు, కర్నూలు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. వాతావరణంలో తేమ శాతం బాగా తగ్గటం వల్ల పొడిగా ఉండే వేడి గాలుల తీవ్రత పెరిగినట్టు వాతావరణశాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి..