ఇంటర్ ఫలితాల వెల్లడిలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తప్పులు కొనసాగుతూనే ఉన్నాయి. రీవెరిఫికేషన్ ఫలితాల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది. తెలుగులో 20 మార్కులు వచ్చి ఫెయిలైన బాధతో కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన అనామిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రీవెరిఫికేషన్లో 48 మార్కులతో పాసైనట్లు శనివారం వెబ్సైట్లో వెల్లడించింది. ఒక్కసారిగా కంగుతిన్న అనామిక కుటుంబ సభ్యులు, బాలల హక్కుల సంఘం, సీపీఐ నాయకులు... తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనామిక కుటుంబసభ్యులు ఆందోళన చేసేసరికి... ఇంటర్ బోర్డు మళ్లీ వెబ్సైట్లో మార్కులు మార్చేసింది. అనామిక రీవెరిఫికేషన్‌లోనూ ఫెయిలైందని చెబుతోంది. పున:పరిశీలనలో ఆమెకు ఒక్క మార్కే పెరిగి.. 21 మార్కులు వచ్చాయని తెలిపింది. అయితే ఆమెకు 48 మార్కులు వచ్చినట్లు పొరపాటున వెల్లడించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. మూల్యాంకన కేంద్రంలోని సిబ్బంది క్లరికల్ తప్పు వల్ల ఇలా జరిగిందన్నారు. అనామిక వ్యవహారంలో తప్పు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. అనామిక జవాబు పత్రాన్ని మీడియాకు బహిరంగపరిచింది.
మే 27 సాయంత్రం 5 గంటల వరకు ఫలితాలతోపాటు... జవాబు పత్రాలను వెబ్సైట్లో వెల్లడించాలని హైకోర్టు స్పష్టం చేసినా.. ఆ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. సుమారు 6వేల సమాధానపత్రాలు ఇంకా స్కానింగ్, అప్‌లోడ్ చేయాల్సి ఉందని ఇంటర్ బోర్డు ఇంకా చెబుతూనే ఉంది. జవాబు పత్రాల అప్‌లోడ్‌లో జాప్యం ఎందుకు జరుగుతోందన్న అనుమానాలు విద్యార్థులు, తల్లిదండ్రులను వెంటాడుతున్నాయి.