రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల రీత్యా ఈవీఎంల భద్రతపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూముల వెలుపల మొదటి స్థాయిలో కేంద్ర పారామిలటరీ బలగాలు మొహరించారు. రెండో స్థాయిలో సాయుధులైన స్థానిక పోలీసుల పహారా ఉంటుంది. చివరి స్థాయిలో స్థానిక పోలీసులు బందోబస్తుగా ఉంటారు.
కంట్రోల్ రూము ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సాగే లెక్కింపు ప్రక్రియకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం 34 చోట్ల ఈవీఎంలను భద్రపరిచింది. స్ట్రాంగ్ రూములలో ఎవరూ ప్రవేశించకుండా సీల్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్ట్రాంగ్ రూముల వద్ద ఓ కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు.
ఈవీఎంలు, వీపీ ప్యాట్ల భద్రతను నిరంతరం గమనించేందుకు ఇద్దరు అధికారులను ఈసీ నియమించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాజకీయ పార్టీల ఏజెంట్లు స్ట్రాంగ్ రూముల భద్రతను తనిఖీ చేసుకునేందుకు ఈసీ అనుమతించింది. పార్టీల ఏజెంట్లకు ప్రత్యేక పాసులు జారీచేస్తోంది. ఏజెంట్లు వచ్చే వెళ్లే సమయాలు నమోదు చేసేందుకు లాగ్ బుక్లు పెట్టారు.
నిఘా నేత్రం
ద్వితీయ భద్రతా వలయం దాటి లోపకి వచ్చే ప్రతీ వ్యక్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. ఎవరినైనా పూర్తి తనిఖీ తర్వాతే లోపలికి అనుమతించాలని తెలిపింది. స్ట్రాంగ్ రూముల వెలుపల, లోపల ఉండే సీసీ కెమెరాలతో నిరంతరం వీడియో చిత్రీకరణ జరుగుతుందని ఈసీ తెలిపింది.
స్థానిక రిటర్నింగ్ అధికారి రోజులో రెండు సార్లు స్ట్రాంగ్ రూముల భద్రతను పర్యవేక్షించాలని ఈసీ ఆదేశించింది. భద్రతా తనిఖీ నివేదికను స్థానిక జిల్లా కలెక్టర్కు నివేదించాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ రూము ఉన్న ప్రాంతంలో ద్వితీయ భద్రతా వలయంలోకి ఏ వాహనాన్ని అనుమతించకూడదని ఈసీ సూచించింది.
ఓట్ల లెక్కింపు రోజు మే 23న మాత్రమే స్ట్రాంగ్ రూముల తలుపులు రిటర్నింగ్ అధికారులు, పోలీసులు, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో తెరవాలని ఈసీ పేర్కొంది. ఓట్ల లెక్కింపు అనంతరం బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను తిరిగి స్ట్రాంగ్ రూములకు చేర్చాలని... అందుకు రిటర్నింగ్ అధికారులు బాధ్యత వహించాలని ఈసీ స్పష్టం చేసింది. తరలింపు వాహనాలన్నింటికీ జీపీఎస్ ట్రాకర్ అమర్చాలని తెలిపింది.
ఇవీ చూడండి : ఈసీ పనితీరును వైకాపా ప్రశంసించడమేంటి?: సబ్బం