భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు, బీఎస్పీ, స్వతంత్రులు...పార్టీలు ఏవైనా సరే ప్రజావ్యతిరేకత ముందే తలవంచాల్సిందే అని మరోసారి నిరూపితమైంది. రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్, ప్రత్యేక హోదాపై మాట మార్చిన భాజపాను ఏపీ ప్రజలు దరి చేరనివ్వలేదు. ఈ రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో ఒక్క స్థానంలోనూ పోటీ ఇచ్చేస్థాయిలో ఓట్లు పొందలేకపోయాయి.
వ్యతిరేకత నొక్కి చెప్పారు
పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ ఓటర్లును మెప్పించకపోతే... నోటాకు ఓటు వేసి వ్యతిరేకత తెలియజేయవచ్చని ఎన్నికల సంఘం నోటాను తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చాలా పార్టీల కంటే నోటాకు అధిక ఓట్లు రావడం రాజకీయ నేతల్ని ఆలోచనలోకి నెట్టింది.
కృష్ణాలో నోటా విజయం
కృష్ణా జిల్లా పరిధిలోని 16 నియోజకవర్గాల్లో నోటాకు సగటున 1.1 శాతం ఓట్లు వచ్చాయి. తిరువూరు అసెంబ్లీ స్థానంలో 12 మంది బరిలో నిలవగా.. వీరిలో వైకాపా అభ్యర్థి రక్షణనిధికి 88,739, తెదేపా అభ్యర్థి కె.జవహర్‌కు 78,092 ఓట్లు రాగా.. నోటాకు 1,746 ఓట్లు నమోదయ్యాయి. తిరువూరు బరిలో నోటా 4వ స్థానంలో నిలిచింది. నూజివీడు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు 1,01,333 ఓట్లు రాగా.. తెదేపా అభ్యర్థి ఎం.వెంకటేశ్వర్లుకి 85,301 ఓట్లు వచ్చాయి. ఇక్కడా నోటాకు 2,236 ఓట్లు వచ్చి 4వ స్థానంలో నిలిచింది. గన్నవరం, గుడివాడ, కైకలూరు, పెడన మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలలో నోటా నాలుగు, ఐదో స్థానంలో నిలిచి ప్రజా వ్యతిరేకతను నేతలకు గుర్తుచేసింది.
రాష్ట్రవ్యాప్తంగా..
ఓట్ల లెక్కింపు ముగిసి, ఫలితాలపై స్పష్టత వచ్చిన తరుణంలో ఎన్నికల సంఘం పార్టీల ఓట్ల శాతాల్ని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో డజనుకుపైగా రాజకీయ పార్టీలు పోటీపడగా కేవలం 2 పార్టీలు మాత్రమే నోటా కంటే అధిక శాతం ఓట్లు గెలుచుకున్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టిన భాజపాకి.. రాష్ట్రంలో ఒక శాతానికి మించి ఓట్లు పడలేదు.
ఇవీ చూడండి : కాబోయే సీఎంకు అధునాతన వాహన శ్రేణి సిద్ధం