రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వివాదాలపై వాదనలు వినిపించనున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా ట్రిబ్యునల్ ముందు నదీ జలాల కేటాయింపుపై తమ వాదనలు వినిపించనున్నాయి. ఇటీవలే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నదీ జలాల సద్వినియోగం, నీటి కేటాయింపులు, వరద నీరు సద్వినియోగం వంటి అంశాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాలు జలబంధంతో సాగాలనే భావంతో పనిచేస్తున్నట్లు ఇద్దరు సీఎంలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. తాజా వాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ట్రైబ్యునల్స్
కృష్ణా జలాల పంపిణీకి మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య తలెత్తిన వివాదాలు పరిష్కరించే నిమిత్తం.. కేంద్ర ప్రభుత్వం 1969లో ఆర్.ఎస్.బచావత్ ఛైర్మన్‌గా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1976లో నివేదిక సమర్పించింది. ఆ ప్రకారం 75 శాతం లభ్యత ఆధారంగా మొత్తం 2,060 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయని నిర్థారించింది. వీటిలో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించారు.
ట్రిబ్యునల్ తీర్పునకు సమీక్షగా ఏప్రిల్ 2004లో బ్రజేష్ మిశ్రా ఛైర్మన్‌గా 'కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2'ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ డిసెంబరులో 2010లో నివేదికను సమర్పించింది. అదనంగా 65 శాతం నీటి లభ్యత ఆధారంగా లభించే 163 టీఎమ్‌సీలను, మిగులు జలాలుగా గుర్తించిన 285 టీఎమ్‌సీలను మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని తీర్పు వెలువరించింది. ఈ ప్రకారం మొత్తం నదిలో నీటి లభ్యత 2,578 టీఎమ్‌సీలు. అందులో మహారాష్ట్రకు 666, కర్ణాటకకు 911, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,001 టీఎంసీలు కేటాయించింది.
రాష్ట్ర విభజన జరిగాక.. రెండు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం ప్రకారం, ట్రిబ్యునల్ తీర్పుల ప్రకారం కృష్ణా నదీ జలాల పంపిణీ అమలు, కొత్త ప్రాజెక్టుల అనుమతి సంబంధిత వివాదాల పరిష్కారానికి 'కృష్ణా నది యాజమాన్య బోర్డు'ను ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారమే రెండు రాష్ట్రాల మధ్య కేటాయింపులు చేస్తుంది. 2015లో ఉభయ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ కేటాయించిన 811 టీఎంసీల నీటిని 63.13, 36.87 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 512.04, తెలంగాణ 298.96 టీఎంసీలు పంచుకోవాలి. తాజాగా.. ఇరు రాష్ట్రాల అవసరాల నేపథ్యంలో.. ట్రిబ్యునల్ ముందు ఎలాంటి వాదనలు వినిపిస్తారన్నది ఆసక్తిగా మారింది.