భాజపా సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి కన్నుమూశారు. చిన్న ప్రేగు సంబంధిత కాన్సర్ తో గత కొంత కాలంగా బాధ పడుతున్న ఆయన...కేర్ బంజారాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఈనెల 10న కేర్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు13న చిన్నపేగుకి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఉన్నట్టుండి ఆరోగ్యం విషమించటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బాల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం
విద్యార్థి దశలోనే ఉద్యమాల్లో పాల్గొన్న బాల్‌రెడ్డి జనసంఘ్‌లో చేరారు. 1977లో జనతాపార్టీలో చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగారు. 1985, 1989, 1994లో మూడు సార్లు కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. నియోజకవర్గ ప్రజలతో కార్వాన్ టైగర్‌గా పిలుపించుకున్నారు. 1991, 1998, 1999లలో హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి ఎన్నికల్లోనూ రాజేంద్రనగర్ బరిలో దిగి గెలవలేకపోయారు. కడవరకు భారతీయ జనతా పార్టీలోనే క్రియాశీలకంగా పనిచేశారు.