గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ 26 విచారణ కమిటీలు నియమించారని మాజీ మంత్రి కళా వెంకట్రావు గుర్తు చేశారు. ఒక్క విషయంలోనూ ఆరోపణ రుజువు చేయలేకపోయారన్నారు. ఇప్పుడు మళ్లీ కేబినెట్ సబ్ కమిటీ వేసి, గత ప్రభుత్వ పాలనలో జరిగిన పాలసీలు, ప్రాజెక్టులు, ప్రోగ్రాములు, మరియు సంస్థలపై విచారణ పేరుతో ప్రతిపక్షంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పీపీఏలపై జగన్ చెప్పేవన్నీ అసత్యాలేనన్నారు. రాజధాని నిర్మాణాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా చేపట్టామన్నారు.
గతంలో అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాజధానిపై తెదేపా చేసిన సవాళ్లకు అప్పుడు వైకాపా బదులివ్వకుండా అసెంబ్లీ నుంచి నిష్క్రమించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టామన్నారు. ఇప్పుడు అభివృద్ధిని కుంభకోణంగా చూపిస్తూ అప్రతిష్ఠ పాలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు.