ఉద్యోగ అన్వేషణలో ఉన్న 2.9కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించినట్టు ఆన్లైన్ నిఘా సంస్థ సైబిల్ వెల్లడించింది. వారి వివరాలను సైబర్ నేరగాళ్లు డార్క్వెబ్లోని హ్యాకింగ్ ఫోరంలో పోస్ట్ చేశారని తెలిపింది.
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్, అమెరికాకు చెందిన సీక్వోయా నిధులతో పనిచేసే భారతీయ విద్యా సాంకేతిక సంస్థ అన్అకాడెమీ కూడా హ్యాకింగ్ బారిన పడినట్లు ఇటీవలే వెల్లడించింది సైబిల్.
హ్యాకింగ్ జరగడం సాధారణమేననీ, ఈసారి మాత్రం కీలక వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు సేకరించారని బ్లాగ్లో సైబిల్ పేర్కొంది. విద్యార్హత, చిరునామా, మెబైల్ నంబర్, ఈ-మెయిల్, సహా మరిన్ని వివరాలను సైబర్ నేరగాళ్లు అపహరించారని పేర్కొంది. ప్రముఖ జాబ్ వెబ్సైట్ పేరుతో ఫోల్డర్లో హ్యాకర్లు డేటా పోస్ట్ చేశారని నివేదికలో పేర్కొంది.
అయితే సైబర్ నేరగాళ్లు ఈ వివరాలను ఎక్కడి నుంచి అపహరించారనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సైబిల్ వివరించింది. రెస్యూమ్ అగ్రిగేటర్ల నుంచే సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించి ఉంటారని అంచనా వేస్తున్నట్టు వివరించింది.
ఆన్లైన్ నేరాలకు పాల్పడేందుకు నకిలీ గుర్తింపు కోసం హ్యాకర్లు ఎల్లవేళలా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తుంటారని ప్రకటనలో తెలిపింది సైబిల్.