తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు జాతీయ నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్న చంద్రబాబు...ఉత్తర్ ప్రదేశ్‌లో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలతో సమావేశమయ్యారు. మాయావతితో సుమారు గంటపాటు మాట్లాడిన చంద్రబాబు ఫలితాల అనంతరం వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం దిల్లీ వెళ్లారు.
లఖ్‌నవూ పర్యటనకు ముందు.. దిల్లీలో రెండో రోజు జాతీయ స్థాయి నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఎల్జేడీ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో మంతనాలు చేశారు. ఈ సమావేశాల్లో చంద్రబాబు... వివిధ పార్టీల అభిప్రాయాలు, ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్డీఏ యేతర కూటమి బలోపేతానికి పావులు కదిపారు.