రాష్ట్రంలో వామపక్ష, జనసేన పార్టీలే రాజకీయ ప్రత్యామ్నాయమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పర్యటించిన ఆయన తాజా రాజకీయాలపై మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించగల సత్తా తమ పార్టీలకే ఉందన్నారు. తెదేపా, వైకాపా కేంద్రప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయాయని విమర్శించారు. ప్రత్యేక హోదాపై భాజపా, తెదేపా యూటర్న్ లు తీసుకున్నాయన్నారు.
రాష్ట్రానికి హోదా ఎవరు ఇస్తే వారికే తన మద్దతంటున్న వైకాపా..భాజపాతో లాలూచీ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోన్న భాజపాతో లోపాయికారి ఒప్పందాలు సబబు కాదని హితవుపలికారు. ఐటీ దాడులు చేయడంపై స్పందించి రాఘవులు...అభ్యర్థులను భయందోళనకు గురిచేసేందుకే సోదాలు చేపట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇటువంటి చర్యలు సరికాదన్నారు. అక్రమ ఆస్తులు ఉన్నాయని తెలిసినప్పుడు ఇంతకాలం ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు.
గిరిజనుల హక్కులను కాలరాసిన తెదేపా, భాజపాలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. గిరిజన హక్కుల సాధనకు పోరాడే వామపక్షాలనే గెలిపించాలని కోరారు.
ఇవీ చూడండి 'భాజపా వ్యతిరేకులు దేశద్రోహులు కారు'