రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై తాను మాట్లాడితే భూకంపాలు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు అనడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొందరు భూకంపాలు సృష్టిస్తామన్నారు...కానీ అవేవీ జరగలేదని ఎద్దేవా చేశారు. కౌగిలింత, కన్ను కొట్టడం వంటి చేష్టలు లోక్సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు పరిచయం చేశారని విమర్శించారు మోదీ.
సార్వత్రిక ఎన్నికల ముందు లోక్సభ ఆఖరు సమావేశంలో మోదీ ప్రసంగించారు. దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తంగా పెరిగిందన్నారు.
స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ నడిపిన తీరును ప్రశంసించారు. 17 సెషన్ల లోక్సభలో ఎనిమిది సెషన్లు వంద శాతం ఫలప్రదమయ్యాయన్నారు.
"విశ్వవ్యాప్తంగా భారత్కు ప్రముఖ స్థానాన్ని ఏర్పరిచాం. విదేశాల్లోని అనేక సంస్థల్లో భారత్కు విశిష్ట స్థానం లభించింది. ప్రజాప్రయోజనాల కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ సభలో 219 బిల్లులు ప్రవేశపెడితే 203 ఆమోదం పొందాయి. ఈ సభ జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఐదేళ్ల పాటు సహాయ, సహకారాలు అందించిన సభ్యులకు కృతజ్ఞతలు." - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి