కేంద్ర ఎన్నికల సంఘం వైఖరికి నిరసనగా రేపు దిల్లీలో ధర్నా చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలోని అన్ని భాజపాయేతర పార్టీలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను క్లిష్ట తరం చేసి... వివాదాస్పదంగా మార్చేశారని ఈసీపై మండిపడ్డారు ఆయన. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... తొలుత వీవీప్యాట్‌లు లెక్కించాలనే డిమాండ్‌తోనే ధర్నా చేస్తున్నట్టు వివరించారు.
వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే
రాష్ట్రంలో తెలుగుదేశం విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తమ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. 18 నుంచి 20 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని అభిప్రాయపడ్డారు. 110 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఖాయమని అది 120 నుంచి 130కి పెరగొచ్చని అంచనా వేశారు. వందకు వంద శాతం తెదేపా ప్రభుత్వం కొలువుదీరుతుందని ఘంటాపథంగా చెప్పారు. మైండ్‌గేమ్స్‌తో గొందరగోళ పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియపై మరోసారి 22న శిక్షణ ఉంటుందని... మరింత అప్రమత్తత అవసరమని శ్రేణులకు సూచించారు.
మరోసారి దిల్లీకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కొల్‌కత్తా మీదుగా దిల్లీ వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం బంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతారు. ఫలితాల అనంతరం కేంద్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. అనంతరం కోల్ కత్తా నుంచి నేరుగా దిల్లీ వెళ్తారు. అక్కడ ఎన్డీఏయేతర పార్టీ నేతలతో కలవనున్నారు. రాజకీయాల చర్చతోపాటు కౌంటింగ్ సమయంలో తొలుత వి.వి.ప్యాట్‌లు లెక్కించాలనే డిమాండ్‌పై వివిధ పార్టీల నేతలతో రేపు ఆందోళన చేయనున్నారు.