ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక అనంతరం బడ్జెట్ సమావేశాలు జరగనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లోనే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులతో సమావేశమై ప్రాథమిక అంశాలపై చర్చించారు. నవరత్నాలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ కేటాయింపులు ఉండాల్సిందిగా అధికారులకు సూచనలు ఇచ్చారు. గత ప్రభుత్వ పథకాలలో మార్పులు, సరుబాట్లపై అధికారులతో చర్చించారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీలోగా ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులు బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఆర్థిక శాఖ సూచించింది. సమావేశాల నిర్వహణపై ఈ నెల 14న జరిగే శాసనసభా వ్యవహారాల కమిటీ(బీఏసీ)లో నిర్ణయం తీసుకోనున్నారు.
వచ్చే అక్టోబరు 15వ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం..అందుకు తగిన కేటాయింపులు చేయవలసి ఉంది. రైతు కుటుంబానికి రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు కార్యాచరణ చేపట్టనున్నారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల నియామకం, అమ్మఒడి కార్యక్రమం కింద పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపే ప్రతీ తల్లికీ 15 వేల రూపాయల సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నవరత్నాల ప్రధాన కేటాయింపులపై ఆర్థికశాఖ కసరత్తును ప్రారంభించింది.
ఇవీ చూడండి : ఇసుకపై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం:విష్ణుకుమార్ రాజ్