మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఫలించాయి. ఎటువంటి అలజడి లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అలజడి సృష్టించేందుకు మావోలు చేసిన ప్రయత్నాలను గ్రేహౌండ్స్ పోలీసులు చాకచక్యంతో తిప్పికొట్టారు. విశాఖ జిల్లా పెదబయలు పోలింగ్ బూత్ సమీపంలో అమర్చిన 3 ఐఈడీ బాంబులను గ్రేహౌండ్స్ బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఎన్నికలు అడ్డుకునేందుకు మావోలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పోలీసులు తెలిపారు.
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 646 పోలింగ్ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. 41 గ్రేహౌండ్స్ బృందాలు, 7 సీఆర్పీఎఫ్ బలగాలతో పటిష్ఠ బందోబస్తు కల్పించారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. పర్యవేక్షణకు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలు, హెలికాఫ్టర్లు వినియోగించారు.
ముంచింగ్ పుట్ పోలీసు స్టేషన్ పరిధిలో బోంగా పుట్ ప్రాంతంలో చెట్లను నరికి రోడ్డుపై అడ్డంగా పడేసిన మావోలు రాకపోకలకు అంతరాయం కలిగించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెట్లను తొలగించారు. దండకారణ్యంలోని మూడు పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను ప్రత్యేక హెలికాప్టర్లలో స్ట్రాంగ్ రూంలకు తరలించారు. సాధారణంగా మావో ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే ఎన్నికలు జరగవలసి ఉన్నా...ఓటర్లు క్యూలైన్లలో ఉన్నందున రాత్రి వరకు పోలింగ్ జరిగిందని విశాఖ రూరల్ ఎస్పీ తెలిపారు.
ఇవీ చూడండి ఏంటి విషయం...? ఎవరొస్తున్నారంట..?