అఖండ విజయంతో నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టిన వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్.. మంత్రి పదవుల కేటాయింపులో ఆచితూచి వ్యవహరించారు. రాష్ట్రంలో ముఖ్యమైన సామాజిక వర్గాల వారికి కేబినేట్ బెర్తులు ఖరారు చేశారు. మంత్రిమండలిలలో 25 మందికి చోటు కల్పిస్తూ... నిర్ణయం తీసుకున్నారు. ఈ బృందంలో అనుహ్యంగా... ముగ్గురు నానిలు స్థానం పొందారు. కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని, పేర్ని నానితో పాటు.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని.. మంత్రులు కాబోతున్నారు.
కొడాలి నాని
కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని.. కృష్ణా జిల్లా గుడివాడ ప్రజలకు సుపరిచితుడు. 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009లో తెదేపా తరఫున గెలిచిన కొడాలి నాని, 2012లో వైకాపాలో చేరారు. 2014, 2019లలో వైకాపా నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఈ ఎన్నికల్లో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీచేశారు. తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్‌పై గెలుపొందారు.
ఆళ్ల నాని
ఆళ్ల కాళి కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే. 2004 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన... విభజన సమయంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. 2014లో వైకాపా చేరిన ఆళ్ల...2017లో మండలిలో అడుగుపెట్టారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని ఎమ్మెల్యేగా గెలిపొందారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, సామాజిక వర్గ సమీకరణాలు ఆళ్లకు మంత్రి పదవిని కట్టబెట్టాయి.
పేర్ని నాని
పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని.. 2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై భారీ ఆధిక్యంతో గెలిచి...నియోజకవర్గంలో ఫ్యాన్ తిప్పారు. అనుభవం, సామాజిక సమీకరణాలతో పేర్ని నానికి జగన్ జట్టులో స్థానం లభించింది.
ఇవీ చూడండి : జగన్ మంత్రివర్గంలో ఉన్నది వీళ్లే..!