ఏడు పదుల వయసులో చేతికి పని చెప్పిందో అవ్వ. దొంగలుంటారు జాగ్రత్త అంటూనే చాకచక్యంగా చోరీలు చేస్తోంది. గుంటూరు జిల్లా తెనాలి నందులపేటలో విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13న జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో ఇద్దరు మహిళల నుంచి 72గ్రాముల నానుతాడులు దొంగిలించింది 71 ఏళ్ల వృద్ధురాలు.
బాధితులు అందించిన వివరాలు ప్రకారం ఆలయ సీసీ కెమెరాలు, ప్రైవేటు వీడియో గ్రాఫర్ తీసిన దృశ్యాలు గమనించిన పోలీసులు అవాక్కాయారు. గొలుసులు పోగొట్టుకున్న మహిళల వద్దకు ఓ వృద్ధురాలు వచ్చి... దొంగలుంటారు నగలు జాగ్రత్త అని చెప్పడం ఆ వీడియోలో నమోదైంది. అది గమనించిన పోలీసులు ఆ వృద్ధురాలిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. జాగ్రత్త అని చెప్పిన ఆ 71 ఏళ్ల అవ్వే...దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. జనం అధికంగా ఉన్న ప్రదేశాలే లక్ష్యంగా చేసుకొని అవ్వ చోరీలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వృద్ధురాలు జవంగుల సరోజిని అలియాస్ దాసరి సామ్రాజ్యం. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నా... దురాశతో దొంగతనాలు చేస్తోందని తెలిపారు. గతంలోనూ ఈ వృద్ధురాలిపై 7 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. బెయిల్పై బయట ఉన్న ఈమె చోరికి పాల్పడినట్లు తెనాలి రెండో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ కిషోర్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి