2050 కేజీల గంజాయి.. సుమారు రూ. 2 కోట్లకు పైగా విలువ. గుట్టుచప్పుడు కాకుండా లారీలో ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తనిఖీలు చేపట్టడంతో గంజాయి ముఠా గుట్టు రట్టయ్యింది.
తూర్పుగోదావరి జిల్లా జగంపేట మండలం రామవరం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గంపేట సీఐ సురేష్ బాబుకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట మండలం రామవరం శివారు రాజస్థాన్ దాబా వద్ద ఆగి ఉన్న లారీని పోలీసులు తనిఖీ చేశారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన 2050 కేజీల గంజాయిని గుర్తించారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి రూ.2 లక్షల 31 వేల నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పెద్దాపురం డీఎస్పీ అరిటాకులు శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లాకు చెందిన రజిత్ బాగ్, ప్రసాద్, దార కృష్ణ, సింహాద్రి, అనే వ్యక్తులను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. ఈ లారీతో పాటు, బొలెరో, టొయోటా కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి రూ. 2 లక్ష 31 వేల రూపాయల నగదు, బంగారం కూడా రికవరీ చేసి కోర్టుకు అప్పగించినట్లు తెలిపారు.
ఈ అక్రమ గంజాయి ఉత్తరప్రదేశ్‌కు రవాణా అవుతుందని వెల్లడించారు. ఇందులో మరో ఇద్దరు నిందితులు ఉన్నారని.. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. విశాఖ దట్టమైన అడవులలో ఏఓబీ ప్రాంతంలో గంజాయ్ పండిస్తున్నారని తెలిపారు. చింతపల్లి దగ్గర ఉన్న బ్రోకర్లు దీనిని కొని ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని వివరించారు.
ఇదీ చదవండి: Acid Attack: అనుమానమే పెనుభూతం- భార్యపై యాసిడ్ దాడి