Tension at Pasalapudi: రాజమహేంద్రవరంలో అమరావతి రైతుల పాదయాత్రపై అల్లరి మూకల దాడి మరవక ముందే.. మరో అడ్డంకి ఎదురైంది. కోనసీమ జిల్లా పసలపూడిలో మహాపాదయాత్రను పోలీసులే అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఐడీ కార్డులు చూపనిదే ముందుకు అనుమతించబోమని చెప్పడంతో... పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. తాళ్లతో రైతుల్ని అడ్డుకునే క్రమంలో పలువురు రైతులకు గాయాలయ్యాయి. ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయారు.
40వ రోజు స్థానిక ప్రజలు, రాజకీయ పక్షాల మద్దతు, ఆదరణలతో ముందుకు సాగిపోతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు.. పోలీసుల రూపంలో అడ్డంకి ఏర్పడింది. రామవరం నుంచి మొదలై.. సాగిపోతున్న పాదయాత్రను పసలపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. 600 మంది రైతులే పాదయాత్రలో పాల్గొనాలని.. ఐడీ కార్డులు చూపనిదే ముందుకు కదలనివ్వబోమని అల్టిమేటం జారీ చేశారు. పోలీసులతో అమరావతి ఐకాస నేతలు, రైతులు మాట్లాడే క్రమంలో.. వాగ్వాదం చోటు చేసుకుంది. ముందుకు సాగాలని ప్రయత్నించిన రైతులను.. తాళ్ల సాయంతో పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారంటూ.. రైతులను నెట్టేశారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు.. ఇలా ఎవరినీ లెక్కచేయకుండా లాగి పడేశారు. తీవ్ర తోపులాట చోటు చేసుకోవడంతో... పలువురు రైతులకు గాయాలయ్యాయి. ఓ వృద్ధురాలికి తలపై గాయం కావడంతో.. సొమ్మసిల్లి పడిపోయింది. ఐకాస నేతలపైనా పోలీసులు చేయి చేసుకున్నారు. ఆగ్రహించిన రైతులు.. పోలీసుల తీరును నిరసిస్తూ పాదయాత్ర రథం ముందు బైఠాయించారు.
పసలపూడిలో స్వామివారి రథం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులకు.. స్థానికులు, తూర్పుగోదావరి జిల్లా ముస్లిం, మైనార్టీ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. రైతుల పేర్లతో కూడిన జాబితాను డీజీపీ కార్యాలయానికి పంపామని.. సగం మందికే ఐడీ కార్డులు పంపారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నపళంగా ఐడీలు చూపమంటే ఎక్కడి నుంచి తేవాలని.. ప్రశ్నించారు. పాదయాత్రకు ఆటంకం కలింగించాలనే ఉద్దేశంతో.. పోలీసులు కావాలనే అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులందరి వద్ద ఆధార్ కార్డులు ఉన్నా.. వాటిని పోలీసులు చూడబోమంటూ దురుసుగా ప్రవర్తించారని అమరావతి ఐకాస నేతలు మండిపడ్డారు. డీఎస్పీ స్థాయి వ్యక్తి.. అసభ్యకరంగా మాట్లాడారన్నారు. శనివారం ఉదయం ఐడీ కార్డులు చూపిస్తామని వేడుకున్నా.. ఇక్కడే చూపించాలని లేకపోతే ముందుకు వెళ్లనీయమని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోనే.. ఐడీ కార్డులు చూపాలని రైతులను కోరామని పోలీసులు తెలిపారు. రైతులపై తాము దాడి చేయలేదని.. వారే తమపై దాడి చేశారని చెప్పుకొచ్చారు. పోలీసులు అబద్ధం చెబుతున్నారని... వారే తమను కొట్టారంటూ మహిళలు.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు, ఐకాస నేతలతో చర్చల తర్వాత.. వారిని ముందుకు వెళ్లనిచ్చేందుకు పోలీసులు అనుమతించారు. శనివారం ఉదయం ఐడీ కార్డులు చూపించాకే పాదయాత్రకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. అలాగే పాదయాత్రలో కేవలం నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మద్దతు తెలిపే వారు.. పాదయాత్రలో పాల్గొనకూడదని... రోడ్డుకు ఇరువైపులా నిల్చుని సంఘీభావం వ్యక్తం చేయెచ్చని చెప్పారు.
ఉద్రిక్తతలు సద్దుమణగడంతో.. రైతుల పాదయాత్ర ముందుకుసాగింది. రామచంద్రపురానికి రైతులు చేరుకున్నారు. రామచంద్రాపురంలో రైతులకు స్వాగతం పలికేందుకు స్థానికులు తరలివచ్చారు. రహదారికి ఇరువైపులా మద్దతుదారులను పోలీసులు నెట్టివేశారు.
ఇవీ చదవండి: