YSRCP Incharges Third List:సుదీర్ఘ కసరత్తు తర్వాత పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా వైఎస్సార్సీపీ విడుదల చేసింది. ఈమేరకు 21 మందితో మూడో జాబితాను వైసీపీ విడుదల చేసింది. ప్రస్తుతం ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చల అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 స్థానాలకు ఇన్‌ఛార్జిలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రకటించిన ఇన్ఛార్జ్లే వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులుగా ఉంటారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
వైఎస్సార్సీపీ మూడో జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వారిని తప్పించి వేరొకరిని నియమించింది. విశాఖపట్నం సిట్టింగ్ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ, ఏలూరు సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ను పార్టీ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే కర్నూలు సిట్టింగ్ ఎంపీ సింగిరి సంజీవ్ కుమార్‌ను పార్టీ ఇన్చార్జి పదవి నుంచి తప్పించారు. కాగా ఆయన ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. ఇక తిరుపతి సిట్టింగ్ ఎంపీ మద్దిల గురుమూర్తిని పార్లమెంట్ ఇన్ఛార్జ్ నుంచి తప్పించి సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది.
ఎంపీ అభ్యర్థులు:
నెంబర్ | నియోజకవర్గం | అభ్యర్థి పేరు |
1 | విశాఖ | బొత్స ఝాన్సీ లక్ష్మి |
2 | కర్నూలు | గుమ్మనూరి జయరాం |
3 | తిరుపతి | కోనేటి ఆదిమూలం |
4 | శ్రీకాకుళం | పేరాడ తిలక్ |
5 | ఏలూరు | కారుమూరి సునీల్ కుమార్ |
6 | విజయవాడ | కేశినేని నాని |
అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు:
నెంబర్ | నియోజకవర్గం | అభ్యర్థి పేరు |
1 | ఇచ్ఛాపురం | పిరియ విజయ |
2 | టెక్కలి | దువ్వాడ శ్రీనివాస్ |
3 | చింతలపూడి | విజయరాజు |
4 | రాయదుర్గం | మెట్టు గోవిందరెడ్డి |
5 | దర్శి | శివప్రసాద్ రెడ్డి |
6 | పూతలపట్టు | సునీల్ కుమార్ |
7 | చిత్తూరు | విజయానందరెడ్డి |
8 | మదనపల్లె | నిస్సార్ అహ్మద్ |
9 | రాజంపేట | ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి |
10 | ఆలూరు | విరూపాక్షి |
11 | కోడుమూరు | డాక్టర్ సతీష్ |
12 | గూడూరు | మేరిగ మురళి |
13 | సత్యవేడు | మద్దిల గురుమూర్తి |
14 | పెనమలూరు | జోగి రమేశ్ |
15 | పెడన | ఉప్పాల రాము |
59 నియోజకవర్గాల్లో మార్పు: ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను వైసీపీ మార్చింది. ప్రస్తుతం 21 నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జ్‌లను మార్చింది. ఇటీవల రెండో జాబితాలో 27 మందిని, మొదటి లిస్టులో 11 మందిని మార్చారు. దీంతో ఇప్పటివరకు ఎంపీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 59 మంది పార్టీ ఇన్‌ఛార్జ్‌లను వైసీపీ మార్చింది.
అన్నదమ్ముల మధ్య పోటీ తప్పదా: ఇటీవల టీడీపీని వీడిన ఎంపీ కేశినేని నానికి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్‌పై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరోవైపు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి కేశినేని నాని సోదరుడు చిన్ని పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలో వచ్చే ఎన్నికల్లో అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తిగా ఉండనుంది.
Incharge Changes In YSRCP: సార్వత్రిక ఎన్నికల ముంగిట వైసీపీ అధిష్ఠానం ఇంఛార్జులను మార్పు చేయడం పార్టీలో తీవ్ర అలజడి రేపింది. తొలి జాబితాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఇద్దరు మంత్రులతో సహా ఎనిమిది మందిని మార్చిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట, వేమూరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడుదల రజని, మేరుగ నాగార్జునను తప్పించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకురావడంపై తీవ్ర చర్చకు దారితీసింది.
వైసీపీలో అసమ్మతి: ఇప్పటికే ప్రకటించిన రెండు జాబితాలతో వైసీపీలో అసమ్మతి నేతలు ఒక్కొక్కరిగా తమ నిరసన తెలుపుతున్నారు. మరోవైపు పలువురు పార్టీని సైతం వీడుతున్నారు. తాజాగా మూడో జాబితా ప్రకటించడంతో, మరోసారి పార్టీలో అసమ్మతి బయటపడనుందనే వాదనలు వినిపిస్తున్నాయి.