ఓ మహిళ తనను హనీట్రాప్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ కర్ణాటకకు చెందిన భాజపా ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు. చిత్రదుర్గం శాసనసభ్యుడు తిప్పారెడ్డి.. తన వాట్సాప్ నంబర్‌కు ఓ మహిళ నగ్నంగా వీడియో కాల్ చేసిందని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది రాజకీయ ప్రత్యర్థుల పనిగా కొందరు అనుమానిస్తున్నారు. అయితే సీనియర్ నేతను.. హనీట్రాప్‌లోకి దించేందుకు ఓ ముఠా ప్రయత్నించిందని.. ఈ ఫిర్యాదుతో వారిపైన ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
అసలు ఏం జరిగిందంటే?
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. తిప్పారెడ్డికి అక్టోబర్ 31న గుర్తుతెలియని నంబర్ నుంచి ఓ వాయిస్ కాల్ వచ్చింది. దానికి స్పందించిన ఆయనకు వెంటనే.. అదే నంబర్ నుంచి వాట్సాప్‌లో వీడియోకాల్ వచ్చింది. దాన్ని కూడా ఆన్సర్ చేయగా.. వీడియోలో ఉన్న మహిళను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. కాల్లో ఉన్న మహిళ హిందీలో మాట్లాడుతూ.. నగ్నంగా ఉంది. వెంటనే ఎమ్మెల్యే ఆ కాల్‌ను కట్ చేశారు. అయితే.. కాల్ కట్ అయిన వెంటనే ఆ నంబర్ నుంచి కొన్ని పోర్న్ వీడియోస్ వచ్చాయి. వెంటనే ఎమ్మెల్యే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి చిత్రదుర్గంలోని సైబర్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులే ఈ హనీట్రాప్‌కు ప్రయత్నించి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.