Mayurbhanj coin bike: పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. ఈ సామెతకు అద్దం పట్టేదే ఒడిశా మయూర్‌భంజ్ జిల్లా బారిపదాకు చెందిన వికాస్ చేసిన పని. అతను అందరిలా కాకుండా ఏదైనా వినూత్నంగా చేయాలనుకున్నాడు. తాను చేసే పనితోనే ప్రత్యేక గుర్తింపు పొందాలనుకున్నాడు. రూపాయి, రెండు రూపాయలు.. ఇలా మొత్తం నాణేలతోనే ద్విచక్ర వాహనం కొనాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా కొన్నేళ్ల నుంచి చిల్లర సేకరించాడు. ఎక్కడి వెళ్లినా ఎంత వీలైతే అంత చిల్లర పోగు చేశాడు. తన దగ్గరున్న నోట్లను చిల్లరగా మార్పించి జాగ్రత్తగా భద్రపరిచాడు. చివరకు అనుకున్నది సాధించాడు.


ఏళ్లుగా తాను పోగు చేసిన చిల్లర నాణేలను ఇటీవల లెక్కించగా మొత్తం 62 వేల రూపాయలు అయినట్లు గుర్తించాడు. లెక్కింపు పూర్తైన వెంటనే సమీపంలోని హీరో షోరూంలోకి వెళ్లి.. తనకు నచ్చిన స్కూటీని కొనుగోలు చేశాడు. వికాస్ తన ఆసక్తిని నెరవేర్చుకునేందుకు చిల్లర సేకరించినా.. ఆ నాణేలను లెక్కించేందుకు మాత్రం షోరూం సిబ్బంది కాస్త కష్టమే అయింది. చిల్లర అయినా డబ్బులే కదా అని సర్దిచెప్పుకుని లెక్కింపు తర్వాత స్కూటీని అప్పగించారు.


ఇదీచదవండి: దూసుకొచ్చిన బండరాయి .. క్షణాల్లో గాల్లో కలిసిన బైకర్ ప్రాణాలు