Yogi Adityanath Takes Oath: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేశారు. వరుసగా రెండోసారి రాష్ట్రంలో భాజపాను గెలిపించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇకానా క్రికెట్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ సహా హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకుర్.. పార్టీ సీనియర్లు, పారిశ్రామిక వేత్తల మధ్య యూపీకి వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు ఆదిత్యనాథ్. కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
![Yogi Adityanath take oath as Uttar Pradesh CM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14833161_yogi.jpg)
![Yogi Adityanath takes oath as the Chief Minister of Uttar Pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14833161_yogi-cm-oath.png)
గురువారం సాయంత్రం లఖ్‌నవూలో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో సీఎంగా యోగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. యోగిని కోరారు. భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఆదిత్యనాథ్. ప్రమాణస్వీకారానికి ముందు.. పలు ప్రాంతాల్లో భాజపా కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుల్డోజర్లకు హారతి పట్టారు. కొందరు భాజపా మద్దతుదారులు 'బుల్డోజర్ బాబా జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు.
![Yogi Adityanath take oath as Uttar Pradesh CM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14833161_cm.jpg)
![Yogi Adityanath take oath as Uttar Pradesh CM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14833161_ogi-adityanath-take-oath-as-cm.jpg)
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా అఖండ విజయం సాధించింది. మొత్తం 403 స్థానాలకుగానూ ఎన్డీఏ కూటమి 273 చోట్ల విజయబావుటా ఎగురవేసింది. భాజపా 255 చోట్ల గెలుపొందింది. 2017 ఎన్నికలతో పోల్చితే సీట్లు కాస్త తగ్గినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది భాజపా. సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలు దక్కించుకుంది. ఎన్డీఏ కూటమిలోని అప్నా దళ్(సోనేలాల్) 12 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 2, బీఎస్పీ ఒక చోట మాత్రమే గెలిచి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. గోరఖ్‌పుర్ అర్బున్ నుంచి పోటీ చేసిన యోగి 1,02,399 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులను చిత్తుగా ఓడించారు. అంతేగాకుండా సీఎంగా ఐదేళ్ల కాలం పూర్తి చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.
![Yogi Adityanath take oath as Uttar Pradesh CM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14833161_adityanath.jpg)
ఇవీ చూడండి: సోషల్ ఇంజినీరింగ్‌లో భాజపా సక్సెస్.. అండగా నిలిచిన ఓబీసీలు!