YCP Incharges Second List: సుదీర్ఘ కసరత్తు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిల రెండో జాబితా విడుదలైంది. 27 మందితో కూడిన జాబితాను వైసీపీ కేంద్రకార్యాలయం మంగళవారం రాత్రి విడుదల చేసింది. రీజినల్ కోఆర్డినేటర్లతో చర్చించిన అనంతరం రెండో జాబితాను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు.
175 స్థానాల్లో వైకాపా గెలుపే లక్ష్యంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎవరైతే ప్రజాసేవలో అంకితమై ఉన్నారో వారికి చాన్స్ ఇవ్వడంతో పాటు గెలుపునకు ఎక్కువగా అవకాశాలు ఉన్న కొత్త, పాత వారిని అభ్యర్థులుగా ప్రకటించినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం జాబితాలో పేర్లు లేని వారికి సైతం పార్టీ విజయం సాధించిన తరువాత మరిన్ని అవకాశాలు కల్పిస్తామని బొత్స పేర్కొన్నారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా చివరి వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.
ఇటీవల 11 స్థానాల్లో ఇన్‌ఛార్జిలను మార్పు చేసిన వైసీపీ అధిష్ఠానం సుదీర్ఘ కసరత్తు అనంతరం తాజాగా మరో 27 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్పు చేసింది. పలు స్థానాల్లో ఎంపీలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల వారసులను బరిలోకి దింపింది. పలు నియోజకవర్గాల్లో మంత్రులకు స్థాన చలనం తప్పలేదు. కొన్నిచోట్ల సిట్టింగ్‌లను పోటీ నుంచి తప్పించారు. నేడు వైకాపాలో చేరిన జె.శాంతకు హిందూపురం ఎంపీగా అవకాశం కల్పించారు. రామచంద్రాపురంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాశ్‌కు అవకాశం కల్పించి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు.
నియోజకవర్గాల కొత్త ఇన్ఛార్జ్లు
నెంబర్ | ఇన్ఛార్జ్ | నియోజకవర్గం |
1 | భూమన అభినయ్ రెడ్డి | తిరుపతి |
2 | షేక్ నూర్ ఫాతిమా | గుంటూరు |
3 | వంగా గీత | పిఠాపురం |
4 | మాచాని వెంకటేష్ | ఎమ్మిగనూరు |
5 | వరుపుల సుబ్బారావు | ప్రత్తిపాడు |
6 | పిల్లి సూర్యప్రకాశ్ | రామచంద్రాపురం |
7 | తాలె రాజేష్ | రాజాం |
8 | మలసాల భరత్ కుమార్ | అనకాపల్లి |
9 | కంబాల జోగులు | పాయకరావుపేట |
10 | వేణుగోపాల్ | పి.గన్నవరం |
11 | మార్గాని భరత్ | రాజమండ్రి సిటీ |
12 | చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ | రాజమండ్రి రూరల్ |
13 | తెల్లం రాజ్యలక్ష్మి | పోలవరం |
14 | మక్బూల్ అహ్మద్ | కదిరి |
15 | పేర్ని కృష్ణమూర్తి | మచిలీపట్నం |
16 | చెవిరెడ్డి మోహిత్ రెడ్డి | చంద్రగిరి |
17 | ఉష శ్రీచరణ్ | పెనుకొండ |
18 | తలారి రంగయ్య | కల్యాణదుర్గం |
19 | గొడ్డేటి మాధవి | అరకు |
20 | విశ్వేశ్వరరాజు | పాడేరు |
21 | వెల్లంపల్లి శ్రీనివాస్ | విజయవాడ సెంట్రల్ |
22 | షేక్ ఆసిఫ్ | విజయవాడ వెస్ట్ |
23 | తోట నరసింహం | జగ్గంపేట |
24 | చంద్రశేఖర్ | ఎర్రగొండపాలెం |
ఎంపీ అభ్యర్థులుగా:
నెంబర్ | ఇన్ఛార్జ్ | నియోజకవర్గం |
1 | జె.శాంత | హిందూపురం |
2 | కె.భాగ్యలక్ష్మి | అరకు |
3 | మాలగుండ్ల శంకరనారాయణ | అనంతపురం |
38 నియోజకవర్గాల్లో మార్పు: ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను వైసీపీ మార్చింది. ప్రస్తుతం 27 నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జ్‌లను, ఇటీవల 11 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జ్‌లను మార్చింది. దీంతో ఇప్పటివరకు 38 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జ్‌లను వైసీపీ మార్చింది.
వైఎస్సార్సీపీ మునిగి పోతున్నా జగన్ మేకపోతు గాంభీర్యం!
Incharge Changes In YSRCP : సార్వత్రిక ఎన్నికల ముంగిట వైసీపీ అధిష్ఠానం ఇంఛార్జులను మార్పు చేయడం పార్టీలో తీవ్ర అలజడి రేపింది. తొలి జాబితాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఇద్దరు మంత్రులతో సహా ఎనిమిది మందిని మార్చారు. చిలకలూరిపేట, వేమూరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడుదల రజని, మేరుగ నాగార్జునను తప్పించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 11 నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుతో ఆ పార్టీ అసంతృప్తి భగ్గుమంది.
YSRCP MLA Alla Ramakrishna Reddy Resigned : ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీకీ రాజీనామా చేశారు. గాజువాక టికెట్ ఆశించి పని చేసుకుంటున్న సిటింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్‌రెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే అయితే ఫోన్ స్విచాఫ్ చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అసహనానికి లోనై తీవ్రమైన చర్యకు పాల్పడేందుకు సిద్ధమయ్యారు. ఈ 11 సీట్లలో సమన్వయకర్తల మార్పు వెనుక డబ్బు, లాబీయింగ్ గట్టిగా పని చేసిందని ప్రచారం సాగుతోంది. ఒక కాంట్రాక్టరు 50 కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటానంటే ఆయనకో నియోజకవర్గాన్ని అప్పగించారని ఇద్దరు మాజీ మంత్రులకు సొమ్ము ముట్టజెప్పిన ఒకరికి మరో నియోజకవర్గం అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. ఒక మంత్రి లాబీయింగ్‌తో మరో నాయకుడికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.