దీపావళి అంటే హిందువుల ఇళ్లల్లో సాయంత్రం వేళ లక్ష్మీదేవికి పూజ చేస్తారు. తమకు సకల ఐశ్వరం దక్కాలని ప్రార్థిస్తారు. ఝార్ఖండ్‌లోని జంషెద్‌పుర్‌లో మాత్రం కాళీ మాతను పూజిస్తారు. అది కూడా శ్మశానంలో!.
జంషెద్పుర్లోని బిస్తుపుర్లో 100ఏళ్ల పురాతనమైన పార్వతి ఘాట్ శ్మశానవాటికలో దీపావళి నాడు వచ్చే అమావాస్యకు కాళీ మాతను పూజిస్తారు. సాధారణంగా శ్మశానంవైపు కన్నెత్తి కూడా చూడని వారందరూ.. ఆ రోజున మాత్రం అక్కడికి తరలివెళతారు. రాత్రి నుంచి ఉదయం వరకు అర్చకులు పూజలు నిర్వహిస్తారు. దీనిని 'నిశి పూజ' అని పిలుస్తారు.
అదే సమయంలో శ్మశానంలో తాంత్రికులు, ఆఘోరాలు తమకు సంబంధించిన పూజలు చేస్తారు. మృతదేహాలను ఖననం చేసిన చోటే, అఘోరాలు ధ్యానం చేసుకుంటారు. దీనినే 'మహాకాళి సాధన'గా పిలుస్తుంటారు. కాళీమాతను దీపావళి రోజు రాత్రి పూజించుకుంటే శక్తిసామర్థ్యాలు పెరుగుతాయని వారి నమ్మకం. ఇలా లభించే శక్తితో ఏదైనా సాధించవచ్చని వారి విశ్వాసం.
అటు దేవుడిని నమ్మే వారు.. ఇటు తాంత్రికులను విశ్వసించే వారందరూ ఒకే చోట చేరి.. ఏకకాలంలో పూజలు చేయడం అతిపెద్ద విశిష్ఠత అని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
ఇదీ చూడండి:- విషాదం.. టపాసులు పేలి తండ్రీకొడుకులు మృతి