అంటువ్యాధుల కట్టడి మార్గదర్శకాల ప్రకారం కొన్ని కొవిడ్-19 కేసులను గుర్తించలేకపోయినప్పటికీ.. మరణాలను తక్కువగా నమోదు చేసేందుకు అవకాశమే లేదని స్పష్టం చేసింది కేంద్రం. భారత మరణాల రిజిస్ట్రేషన్ వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నట్లు తెలిపింది.
కొవిడ్ రెండో దశ ఉద్ధృతి సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థలు సమర్థమైన చికిత్సపై దృష్టిసారించాయని.. దాని ద్వారా కొవిడ్ మరణాలను గుర్తించటం, నమోదు చేయటంలో కాస్త జాప్యం జరిగినట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. అయితే.. ఆ తర్వాత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరణాల సంఖ్యను సవరించినట్లు గుర్తు చేసింది.
కొవిడ్-19 మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈమేరకు స్పష్టతనిచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ. మరణాల సంఖ్య సవరణ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. ఎనిమిది రాష్ట్రాల్లో మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం ఉన్న గణాంకాలు అంచనాలు మాత్రమేనని, సరైన సమాచారం తెలియకపోవచ్చని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: కొవిడ్ కట్టడికి కేరళ 'కొత్త వ్యూహం'- గురువారం నుంచే...