ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి 'కాపాడేందుకు' తృణమూల్ కాంగ్రెస్ బీర్భూం జిల్లా అధ్యక్షుడు అనుబ్రతా మోండల్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మోండల్‌ను అదుపులోకి తీసుకొని దిల్లీలో విచారించాలని ఈడీ భావించగా.. అంతకుముందే ఓ పాత కేసులో బంగాల్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను దుబ్రాజ్పుర్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయన్ను ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.
పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసును ఈడీ విచారిస్తోంది. ఇందులో భాగంగా అనుబ్రతా మోండల్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకుంది. కేసులో నిందితుడైన ఎనముల్ హక్, మాజీ బాడీగార్డ్ సైగల్ హొస్సైన్తో కలిపి మోండల్‌ను దిల్లీలో విచారించాలని అనుకుంది. అయితే, బంగాల్ పోలీసుల రంగప్రవేశంతో సీన్ మారిపోయింది.
2021లో ఓ టీఎంసీ కార్యకర్తపై దాడి చేసిన కేసులో మోండల్‌ను మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. అసన్సోల్ పునరావాస కేంద్రంలో ఉన్న ఆయన్ను అరెస్టు చేసి, వెంటనే కోర్టులో ప్రవేశపెట్టారు. 14 రోజుల కస్టడీ కోరారు. అయితే, న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీకి అప్పగించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం జైలుకు తరలించారు. అయితే, ఇదంతా తమ నుంచి కాపాడేందుకే చేశారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
టీఎంసీ బాహుబలి
మమతకు అనుబ్రత అత్యంత సన్నిహితుడు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఇచ్చిన ఖేలా హోబే నినాదానికి ఈయన ప్రాచుర్యం కల్పించారు. ఆ జిల్లాలో టీఎంసీకి బాహుబలి తరహా నేతగా ఆయన్ను పార్టీ వర్గాలు అభివర్ణిస్తాయి. పశువుల అక్రమ రవాణా కేసులో 2020లో సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత ఈయన పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి జిల్లాలో దర్యాప్తు సంస్థ ఇప్పటికే సోదాలు నిర్వహించింది. అనుబ్రత అంగరక్షకుడిని అరెస్టు చేసింది.