బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భవానీపుర్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఎవరు పోటీకి దిగుతారన్న అంశంపై స్పష్టత వచ్చింది. న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది భాజపా. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సెంట్రల్ కోల్‌కతాలోని ఎంటల్లీ నియోజకవర్గం నుంచి తిబ్రీవాల్ భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు. బంగాల్ శాససనభ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై కలకత్తా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన వారిలో ప్రియాంక ఒకరు.
భవానీపుర్తోపాటు ఈ నెల 30న ఎన్నికలు జరిగే ఇతర నియోజకవర్గాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది భాజపా. సంషేర్‌గంజ్ నుంచి మిలన్ ఘోష్, జంగీపుర్ నుంచి సుజిత్ దాస్‌ను బరిలోకి దింపుతోంది.
ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
ఏప్రిల్‌లో జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు టీఎంసీ 213 కైవసం చేసుకుంది. భాజపా 77 చోట్ల గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఎన్నికల అనంతరం ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకర్గం నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా సీఎం పదవి చేపట్టిన ఆమె.. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. అందుకే భవానీపుర్ ఉప ఎన్నికలో విజయం మమతకు కీలకంగా మారింది.
భవానీపుర్ సహా మరో రెండు నియోజకవర్గాల ఉపఎన్నికల ఫలితాలు అక్టోబర్ 3న వెలువడనున్నాయి.
ఇవీ చదవండి: