Samajwadi party with new front: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కొత్త సమీకరణాలకు తెరలేస్తోంది.. ఇంతవరకు కాంగ్రెస్‌తో కలిసి అడుగులు వేస్తుందని భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఆకస్మికంగా మాట మార్చింది. కాంగ్రెస్ కూటమికి ప్రత్యామ్నాయంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్న బంగాల్ సీఎం మమతకు చేయూతనందించాలని ఎస్పీ భావిస్తోంది. ఒకే ప్రయత్నంతో అటు కాంగ్రెస్‌ను, ఇటు యూపీలో అధికారంలో ఉన్న భాజపాను దెబ్బ కొట్టాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. "యూపీలో అధికార పార్టీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయం.. బంగాల్లో తృణమూల్ చేతిలో భాజపా ఎలా ఓడిపోయిందో ఇప్పుడు యూపీలో అలాగే తుడిచిపెట్టుకుపోతుంది. ఈసారి కాంగ్రెస్కు వచ్చే సీట్లు సున్నా" అని అఖిలేశ్ చెబుతున్నారు.
కాంగ్రెస్‌ను పక్కన పెట్టేస్తే భాజపాకే లబ్ధి: సేన
Shiv sena on congress: పురాతన పార్టీ అయిన కాంగ్రెస్‌ను జాతీయ రాజకీయాల నుంచి పక్కనపెట్టి విషక్ష కూటమిని ఏర్పాటు చేయాలని భావించడమంటే పరోక్షంగా అది భాజపాను, ఫాసిస్టు శక్తుల్ని బలోపేతం చేయడమేనని శివసేన పేర్కొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను వద్దనుకుంటున్నవారు ఆ వైఖరిని బాహాటంగా స్పష్టం చేయాలని 'సామ్నా' సంపాదకీయం ద్వారా సేన తెలిపింది. విపక్షాల్లో ఐక్యత లేకపోతే భాజపాకు రాజకీయ ప్రత్యామ్నాయం కష్టమవుతుందని అభిప్రాయపడింది. కొన్ని పార్టీలకు కాంగ్రెస్‌తో విభేదాలున్నా ఇప్పటికీ యూపీఏ కూటమి... ముందుకు వెళ్లడం సాధ్యమేనంది.
ఇదీ చూడండి: Mamata Vs Congress: టీఎంసీ, కాంగ్రెస్ ఫైట్- భాజపా సేఫ్!
కాంగ్రెస్ వైఫల్యంతోనే ప్రత్యామ్నాయం: తృణమూల్
Tmc vs congress: భాజపాపై పోరాటానికి నాయకత్వం వహించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందడంతోనే ప్రత్యామ్నాయ కూటమివైపు దృష్టి సారించాల్సి వచ్చిందని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. "కాంగ్రెస్ లేని విపక్ష కూటమిని నెలకొల్పుతామంటూ మేమెప్పుడూ చెప్పలేదు. కాంగ్రెస్ తన విధుల్ని నిర్వర్తించనప్పుడు ఆ అసమర్థతకు మమ్మల్ని నిందించకూడదు. ఒకరు విఫలమైతే మరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయాలి" అని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ చెప్పారు.
ఉనికి కోసం బీఎస్పీ ఆరాటం
Mayawati in up: ఉత్తర్ ప్రదేశ్‌లో పూర్వ వైభవం కోనం మాజీ సీఎం మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తహతహలాడుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఊవిళ్లూరుతోంది. యూపీ అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 403. 2007 నాటి ఎన్నికలో 206 సీట్లు గెల్చుకోవడం ద్వారా బీఎస్సీ సంపూర్ణ మెజారిటీతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత పరిస్థితి క్రమంగా దిగజారింది. 2012 ఎన్నికల్లో కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. 2017లోనైతే పార్టీ సీట్ల సంఖ్య మరీ దారుణంగా 19కి పడిపోయింది. సీట్లతో పాటే బీఎస్పీకి ఓట్ల శాతమూ తగ్గుతూ వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా రాష్ట్రంలో తమ ఉనికిని కాపాడుకోవడమే ప్రస్తుతం బీఎస్పీ ముందున్న లక్ష్యం.
ఇవీ చూడండి: