వరుడు పేరు కొల్హు కొత్త వస్త్రాలు కట్టుకుని టోపీ పెట్టుకుని రాగా.. వధువు వాసంతి కొత్త బట్టలతో పెళ్లి పందిట్లోకి విచ్చేసింది. వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లిపందిరి కింద వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగింది. రకరకాల వంటకాలతో భోజనాలు సిద్ధం చేసి అతిథులకు వడ్డించారు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ పెళ్లి జరిగింది మనుషులకు కాదండి బాబు! ఓ రెండు పెంపుడు కుక్కలకు. మరి ఆ కథేంటో మీరూ తెలుసుకోండి.


బిహార్ తూర్పు చంపారణ్లోని మోతిహరిలో ఓ అరుదైన వివాహం జరిగింది. మజుర్హాన్ గ్రామానికి చెందిన నరేశ్ సాహ్నీ, సవిత దేవి దంపతులు వారు పెంచుకుంటున్న కుక్కలకు ఘనంగా వివాహం చేశారు. హిందూ సంప్రదాయ ప్రకారం ఈ వివాహానికి పందిరి వేసి అంగరంగ వైభవంగా చేశారు. పండితులు వేదమంత్రాలు చదువుతుండగా.. సహాయకులతో కలిసి వేడుకను నిర్వహించారు.

వివాహం అనంతరం వధూవరులను గ్రామమంతా ఊరేగింపుగా తిప్పారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లికి నాలుగు వందల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. పెళ్లికి వచ్చిన అతిథులకు రకరకాల వంటకాలతో భోజనాలు సైతం సిద్ధం చేశారు. వేడుకకు వచ్చిన అతిథులు వధూవరులను ఆశీర్వదించి భోజనం చేసివెళ్లారు. ఇలాంటి పెళ్లి ఇప్పటివరకు తామెప్పుడూ చూడలేదని గ్రామస్థులు అంటున్నారు.
ఇదీ చదవండి: శిందే వెంట 40 మంది ఎమ్మెల్యేలు.. అసోంకు పయనం.. ఉద్ధవ్ సర్కార్ పతనమేనా?