Sidhu Moosewala murder: పంజాబ్ పాప్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు షూటర్లు సహా ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. నిందితులను ప్రియవత్ అలియాస్ ఫౌజి, కశీష్, కేశవ్ కుమార్‌గా గుర్తించారు. ఈనెల 19న గుజరాత్‌లోని కచ్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు దిల్లీ పోలీసులు చెప్పారు. హత్యకు ముందు అనేకసార్లు రెక్కీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 8 గ్రెనేడ్లు, 9 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, మూడు పిస్టళ్లు, ఓ రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు.
హత్యకు ముందు జరిగిన విషయాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. నిందితులు ఓ బొలేరో, కొరొల్లా కారులో సిద్ధూను అనుసరించినట్లు చెప్పారు. కశీశ్, అంకిత్ సిర్సా, దీపక్, ప్రియవత్ బొలేరోలో ఉన్నారని, మరో కారును జగ్రూప్ డ్రైవ్ చేసినట్లు వివరించారు. సిద్ధూపై మొట్టమొదట కాల్పులు జరిపింది కొరొల్లా కారులో ఉన్న మన్‌ప్రీత్ మను అని తెలిపారు.
పంజాబ్ పోలీసుల యూనిఫాంలు ధరించి సిద్ధూను హత్య చేయాలని నిందితులు మొదట భావించారని పోలీసులు వెల్లడించారు. అయితే యూనిఫాంపై పేర్లు, ఇతర చిహ్నాలు లేకపోవడం వల్ల ఆ ఆలోచన విరమించుకున్నారని చెప్పారు. అంతేకాదు ఒకవేళ హత్య సమయంలో తుపాకులు పనిచేయకపోతే గ్రెనేడ్లు విసిరైనా సిద్ధూను చంపాలని భావించారని, తుపాకులు పనిచేయడం వల్ల గ్రెనేడ్లను వినియోగించలేదని పేర్కొన్నారు. ప్రియవత్పై ఇప్పటికే రెండు హత్య కేసులు ఉన్నాయన్నారు.
గత నెల 29న పంజాబ్‌లోని మన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. ప్రియవత్ సారథ్యంలోని షూటర్ల బృందం సిద్ధూను హత్య చేసినప్పుడు కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌తో సంప్రదింపుల్లో ఉన్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. సిద్ధూ హత్య తమ పనేనని బ్రార్ ఇప్పటికే ప్రకటించాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు అత్యంత సన్నిహితుడు. సిద్ధూ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బిష్ణోయ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: జూదంలో భార్యను ఓడిన వ్యక్తి.. ఇతరులతో శారీరక సంబంధానికి ఒత్తిడి