106 Years Aged Woman: పంజాబ్‌లోని బఠిండాకు చెందిన ఓ శతాధిక వృద్ధురాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. 106 ఏళ్లు వచ్చినా ఇంటి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. పాకిస్థాన్‌లో పుట్టి పెరిగిన బేబే సరోజ్ రాణి.. పంజాబ్ వ్యక్తిని వివాహం చేసుకుని అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఆమెకు ఇంతవరకు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలవ్యాధులు దరిచేరలేదు. ఎంతో హుషారుగా ఉండి నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ బామ్మ ఆరోగ్య అలవాట్ల గురించి తెలుసుకుందాం రండి.
'మంచి ఆహారమే నా రహస్యం'.. తన ఆహారపు అలవాట్లే ఆరోగ్య రహస్యమని చెబుతున్నారు బామ్మ బేబే. ప్రస్తుత రోజుల్లో ఆహారంలో నాణ్యత లోపిస్తుందని, అందువల్లే రోగాలు బాగా పెరిగాయని ఆమె అన్నారు. ఇప్పటికీ తాను ప్రతిరోజు దేశీ నెయ్యిని ఉపయోగిస్తుంటానని, తన రోజువారీ ఆహారంలో కచ్చితంగా నెయ్యి ఉంటుందన్నారు బామ్మ.
"నా ఆరోగ్యంపై కుటుంబసభ్యులు ఎంతగానో శ్రద్ధ తీసుకుంటారు. కొన్నాళ్ల క్రితం నా మనవడికి పెళ్లి చేశాను. వారు తమ రోజువారీ పనులకు వెళ్తే వారి పిల్లలను నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. ముఖ్యంగా ప్రతిరోజు ఆహారాన్ని సరైన సమయంలో తీసుకుంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవు"
-- బేబే సరోజ్ రాణి, 106 ఏళ్ల బామ్మ
ప్రస్తుత రోజుల్లో చాలా మంది యువత డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారని, అది మంచిది కాదని బేబే అన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకుంటే తమ కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుందన్నారు. 106 ఏళ్లు వచ్చినా తాను ఇప్పటికీ శరవేగంగా పరుగెత్తగలనని, తనతో పోటీ పడాలని యువతకు సవాలు విసిరారు. రోజూ పది కిలోమీటర్లకు పైగా నడుస్తానని తెలిపారు బేబే.
ఇవీ చదవండి: 'విచారణకు హాజరుకాలేను.. వాయిదా వేయండి'.. ఈడీకి సోనియా లేఖ
'మోదీజీ.. నల్లచట్టాల్లాగే 'అగ్నిపథ్' పథకాన్ని వెనక్కి తీసుకుంటారు'