తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారని బిహార్ సీఎం నీతీశ్ కుమార్ తెలిపారు. తన బదులు బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జనతా దళ్(యునైటెడ్) అధ్యక్షుడు లలన్ సింగ్ను ఆ కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా తాను కోరానని తెలిపారు.
"కార్యక్రమానికి రావాలని ఆయన (కేసీఆర్) కోరారు. కానీ ఇక్కడ చాలా పనులు ఉన్నాయని ఆయనకు చెప్పా. పార్టీ నుంచి ఎవరినైనా పంపించాలని ఆయన అడిగారు. లలన్ను వెళ్లమని చెప్పా. తేజస్వికి సైతం ఈ విషయం చెప్పమని కేసీఆర్ అడిగారు. 'నేనైతే చెప్తా కానీ మీరు కూడా వారితో మాట్లాడండి' అని సూచించా. వారిద్దరూ (లలన్, తేజస్వి) హైదరాబాద్ వెళ్తున్నారు."
-నీతీశ్ కుమార్, బిహార్ సీఎం
హైదరాబాద్లో కేసీఆర్ సభకు వెళ్లినంత మాత్రాన.. కాంగ్రెస్తో తమ భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదని నీతీశ్ స్పష్టం చేశారు. భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి విపక్షాలను ఏకం చేయాలని తాను చేస్తున్న ప్రయత్నాలను విరమించలేదని తెలిపారు. "నేను ఇదివరకు కూడా చెప్పాను. ఆ ఆలోచనను నేను పక్కన పెట్టలేదు. భారత్ జోడో యాత్ర పూర్తవ్వాలని నేను వేచి చూస్తున్నా. ఆ తర్వాత అన్ని పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటాం. వీలైనంత మందిని కలుపుకొని వెళ్లే కూటమిని ఏర్పాటు చేయడంపై చర్చిస్తాం. భాజపా నుంచి విడిపోయన తర్వాత వివిధ పార్టీలతో చర్చలు జరిపి ఈ (విపక్షాల ఐక్యత) విషయంలో నా వంతు ప్రయత్నాలు చేశా" అని నీతీశ్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్.. విపక్ష నేతలతో కలిసి ఇదివరకే ఓ భారీ సభ నిర్వహించారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు.. ముగ్గురు సీఎంలు, ఓ మాజీ సీఎం, కమ్యూనిస్టు నేతలు హాజరయ్యారు. తాజాగా ఆయన మరో బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫిబ్రవరి 17న తెలంగాణ సెక్రెటేరియట్ను ప్రారంభించిన అనంతరం ఈ సభ ఉండనుంది. ఖమ్మం సభకు నీతీశ్ కుమార్ రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సభకు తనను ఎవరూ పిలవలేదని, పిలిచినా వచ్చి ఉండేవాడిని కాదని నీతీశ్ వ్యాఖ్యానించారు.