Telangana Leaders Fire on Chandrababu Arrest టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణ అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు విడుదల కావాలంటూ సుదర్శన హోమాలు నిర్వహించగా.. ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలు ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలుగుదేశం శ్రేణులు బైక్ ర్యాలీ (Bike rally) నిర్వహించగా.. రిలే దీక్షలు ప్రారంభించారు. విశ్రాంత ఉద్యోగులు దీక్షలో పాల్గొనగా.. మహిళలు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు.
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు వివిధ వర్గాల వారు... నిరసనల్లో పాల్గొన్నారు. కేవలం కక్షసాధింపుతోనే తెలుగుదేశం అధినేతను అరెస్టు చేశారంటూ... జగన్‌పై ధ్వజమెత్తారు. విధ్వంస రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
చంద్రబాబు త్వరగా బయటికి రావాలని ఆకాంక్షిస్తూ కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో... ఆయన అభిమానులు వల్లేపల్లి దుర్గాప్రసాద్, శారద దంపతులు సుదర్శన హోమాన్ని నిర్వహించారు. నందమూరి సుహాసిని, శేర్‌లింగంపల్లి MLA అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో పారిశ్రామికవేత్తలు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలు అన్నీ కల్పితాలేనని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. సంగారెడ్డిలో ఐటీఐ (ITI) కళాశాల నుంచి ఆంజనేయ స్వామివారి దేవస్థానం వరకు... తెలుగుదేశం శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత మహాత్మగాంధీ, ఎన్టీఆర్ (NTR) విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఖమ్మం N.T.R. భవన్ ఎదుట తెలుగుదేశం పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పలువురు అభిమానులు, విశ్రాంత ఉద్యోగులు దీక్షలో కూర్చున్నారు. దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అఖిలపక్షాల నేతలు, ప్రజలు దీక్షలో పాల్గొన్నారు. ఎటపాకలో తెలుగుదేశం నిరసనకు భద్రాచలం కాంగ్రెస్ M.L.A. పొదెం వీరయ్య మద్దతు తెలిపారు. చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) కేవలం కక్షసాధింపేనని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున మహిళలు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆందోళనలో తెలంగాణ తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో NTR విగ్రహం ఎదుట తెలుగుదేశం కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యుడు ఆనంద్‌తోపాటు కార్యకర్తలు పాల్గొని... జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీక్ష అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తెలుగుదేశం బాధ్యుడు అరుణ్‌కుమార్ అధ్వర్యంలో నిడమానూరులో అఖిలపక్ష పార్టీలతో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టారు.